Begin typing your search above and press return to search.

ఆకలి తట్టుకోలేక అక్కడ కప్పల్ని కాల్చుకు తింటున్నారట!

By:  Tupaki Desk   |   22 April 2020 1:30 AM GMT
ఆకలి తట్టుకోలేక అక్కడ కప్పల్ని కాల్చుకు తింటున్నారట!
X
జానెడు పొట్ట తెచ్చే తిప్పలెన్నో. సమయానికి ముద్దు పడకుంటే.. కడుపు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఆహారం లభించక ఆకలితో అలమటించే వారు.. ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం దేనికైనా దిగజారుతారు. ఎంతకైనా తెగిస్తారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం గురించి తెలిస్తే మనసు కదిలిపోతుంది. దేశంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉందా? అన్న ఆవేదనకు గురి కావటం ఖాయం.

బిహార్ లో బయటకు వచ్చిన ఓ హృదయ విదారక ఘటన మనసును కదిలించివేస్తుంది. జెహనాబాద్ కు చెందిన కొందరు చిన్నారులు ఊహించని రీతిలో వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ వేళ.. ఎంతోమంది పేదలకు పూట గడవని పరిస్థితి. ఐదు రోజులుగా తినేందుకు ఏమీ లభించక పోవటంతో.. ఆ చిన్నారులు మురికి కాలువలు.. గుంటల్లో కప్పల్ని పట్టి.. వాటిని కాల్చుకు తింటున్న వైనం బయటకు వచ్చింది.

కప్పల్ని తింటున్న కొందరు.. ఆ చిన్నారుల్ని ఎందుకు వాటిని తింటున్నారని ప్రశ్నించారు. దీంతో ఆ పిల్లలు బదులిస్తూ.. గడిచని ఐదు రోజులుగా తమకు ఎలాంటి ఆహారం లభించలేదని.. దీంతో ఆకలితో ఉన్న తాము కప్పలు పట్టుకొని కాల్చుకు తింటున్నట్లు చెప్పారు. ఇంట్లో వండుకోవటానికి ఏమీ లేవని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారాన్ని సంపాదించుకోటం అసాధ్యంగా వారు చెప్పుకొచ్చారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కప్పల్ని తింటున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ఉదంతం సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగు చూడటం.. వైరల్ గా మారటంతో ప్రభుత్వం స్పందించి.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. అదే సమయంలో వారికి కడుపు నిండా తిండి పెట్టాల్సిన అవసరం ఉంది.