Begin typing your search above and press return to search.

చిల్డ్రన్స్ డే.. మన దేశంలోనే ఎందుకు ఇలా?

By:  Tupaki Desk   |   14 Nov 2021 11:30 AM GMT
చిల్డ్రన్స్ డే.. మన దేశంలోనే ఎందుకు ఇలా?
X
పిల్లలు.. పిడుగులు.. వారికీ ఉంది ఓ రోజు. వారి అల్లరిని ముద్దు ముద్దుగా భరించడం కోసమే నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం. పిల్లలు అంటే ఉరిమే ఉత్సాహం... పిల్లలు పారే సెలయేరు. వారి బుజ్జి బుజ్జి మాటలు, దోస్తులతో తొట్టి గ్యాంగులు, సరదాగా చెప్పుకునే ఎన్నో కబుర్లు... అబ్బో ఆ పిడుగుల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అభం, శుభం తెలియని ఆ పసిమనుసుల బోసి నవ్వులు ఎంత హాయిగా ఉంటాయి కదా. ఎటువంటి కుళ్లు, కుతంత్రం లేని స్వచ్ఛమైన ప్రేమ వారి కళ్లలో సుస్పష్టం అవుతుంది. ఆ వయసులో ఎలాంటి చీకూచింతా, కష్టం తెలియకుండా పెరుగుతారు. అందుకే బాల్యం అంటేనే ఓ మధుర జ్ఞాపకం. మనిషి జీవితంలో మళ్లీ మళ్లీ రావాలనుకునే దశ ఇది ఒక్కటే. అది ఎన్నటికీ జరగదని తెలిసినా బాల్య దశలోకి మళ్లీ వెళ్లిపోతే బాగుండు అని ఎన్నో సార్లు కలలు కంటారు. అంతటి విశిష్టమైన దశలోని పిల్లల కోసం వచ్చే పండుగ చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

బాలల దినోత్సవం రోజున చిన్నారులకు ప్రత్యేకం. ప్రతీ పాఠశాలలోనూ స్పెషల్ ప్రోగ్రాంలు నిర్వహిస్తారు. ఈ రోజు పిల్లలు ఆడిందే ఆట... పాడిందే పాట. అందుకే ఆ బుజ్జి పిడుగులు నవంబర్ 14 వస్తుందంటే చాలు తెగ సంబురపడిపోతారు. అయితే ప్రపంచదేశాలు చిల్డ్రన్స్ డేను నవంబర్ 20న జరుపుకుంటాయి. అయితే మనదేశంలో మాత్రం ఓ ఆరు రోజుల ముందుగానే నిర్వహించుకుంటాం. కారణం అయితే భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు. జవహర్ లాల్ నెహ్రూకి పిల్లలు అంటే చాలా ఇష్టం. ఆ బోసినవ్వుల పాపాయిలపై ఆయనకు మక్కువ ఎక్కువ. అందుకే ఆయన పుట్టిన రోజును మనదేశ పిల్లలు ఓ వేడుకలా జరుపుకోవాలని నిర్ణయించారు. అలా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు.

బ్రిటీషు పాలనలో ఉక్కిరిబిక్కిరి అయిన భారతదేశం... ఆ తర్వాత 1947, ఆగస్టు 15న స్వతంత్య్ర భారతంగా అవతరించింది. అప్పుడు పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ దేశానికి ఎంతో సేవ చేశారు. దేశాన్ని పురోగమనంలోకి తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేశారు. ఆయన దార్శనికత, ఉదారత స్వభావం ఎంతో ఆదర్శవంతమైనవి. అటువంటి గొప్ప వ్యక్తికి మాత్రం బోసి నవ్వుల పాపాయిలు అంటే చాలా ఇష్టం. ఆయన అప్పట్లో ఏ కార్యక్రమానికి వెళ్లినా పిల్లలను తప్పకుండా కలిసేవారు. వారితో ప్రేమగా మాట్లాడేవారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకునేవారు. అందుకే పిల్లలంతా ఆయనను చాచా అని ముద్దుగా పిలిచేవారు. ఆ తర్వాత ఆయన పేరు కూడా చాచా నెహ్రూగా మారడం విశేషం. ఇంతటి గొప్పతనం ఉన్న వ్యక్తి... పైగా పిల్లలంటే అమితమైన ప్రేమ ఉన్నవ్యక్తి కాబట్టి ఆయన పుట్టిన రోజు నాడు బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

తొలుత మనం కూడా నవంబర్ 20నే చిల్డ్రన్స్ డే జరుపుకునేవాళ్లం. నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కలిసి తీర్మానం చేసుకున్నాయి. దాని ప్రకారం మనమూ అలాగే నిర్వహించుకునేవాళ్లం. కానీ నెహ్రూ మరణానంతరం ఇలా నవంబర్ 14న జరుపుకంటున్నాం. ఎందుకంటే భారతదేశ తొలి ప్రధానిగా విశేష సేవలందించిన జవహర్ లాల్ నెహ్రూ 1964వ సంవత్సరంలో మరణించారు. ఇక ఆయన సేవలకు గుర్తగా ఆ ఏడాది నుంచి నవంబర్ 14న చిల్డ్రన్స్ డే జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అప్పటి నుంచి ఏటా నవంబర్ 14నే బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం.