Begin typing your search above and press return to search.

కేజీ చికెన్‌ కి..అరకిలో ఉల్లి ఫ్రీ!

By:  Tupaki Desk   |   12 Dec 2019 10:37 AM GMT
కేజీ చికెన్‌ కి..అరకిలో ఉల్లి ఫ్రీ!
X
ప్రస్తుతం దేశంలో ఉల్లి కొరత చాలా తీవ్రంగా ఉంది. ఈ ఉల్లి సమస్య పై అసెంబ్లీ నుండి పార్లమెంట్ వరకు అన్ని సభలు కూడా అట్టుడికిపోతున్నాయి. ఎన్నడూ లేనట్టుగా ఉల్లి ధరలు ఒకేసారి ఆకాశాన్ని తాకడంతో ప్రజలు ఉల్లి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఉల్లి కూడా నిత్యావసర సరుకుల్లో చేరిపోయింది. ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో ఏపీ ప్రభుత్వం రాయితీతో రైతు బజారులలో కెజీ ఉల్లి రూ.25కు సరఫరా చేస్తుంది.

దీనితో ఉల్లి కోసం ప్రజలు గంటల కొద్ది క్యూ లో ఉండి కిలో ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు పడుతున్న ఉల్లి పాట్లను చూసిన ఓ వ్యాపారి కొత్తగా ఆలోచించాడు. స్వలాభంతో పాటుగా..ప్రజలకు ఉల్లిని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాడు. ఉల్లి ఫ్రీగాన అని ఆశ్చర్యపోకండి... ఇక్కడే ఇంకో విషయం ఉంది.

పూర్తి వివరాలు .... పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చిలుకూరి సత్యనారాయణ అనే వ్యాపారి కొత్తగా చికెన్‌ వ్యాపారం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. దీనితో వినియోగదారులను ఆకర్షించేందుకు గానూ సరికొత్త ఆఫర్‌ ప్రకటించాడు. కిలో చికెన్‌ కొన్నవారికి అరకిలో ఉల్లిని ఉచితంగా అందజేస్తామని ప్రకటించాడు. ఈ మేరకు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించాడు. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న ప్రజలు దుకాణం ముందు క్యూ కట్టారు.

మొదటి రోజు రెండువందల మందికి పైగా వినియోగదారులు రెండు వందలకిలోలకి పైగా చికెన్‌ కొనుగోలు చేయగా, వారికి వంద కిలోల ఉల్లిని ఉచితంగా ఇచ్చాడు. వాస్తవానికి ప్రారంభించిన ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్‌ ఇస్తామని ప్రకటించిన యాజమాన్యం ప్రజల తాకిడి చూసి మరో మూడు రోజుల పాటు ఉల్లి ఆఫర్‌ పొడిగించాడు. దీంతో స్థానికులతో పాటుగా చుట్టుపక్కల గ్రామస్తులు సైతం సత్యనారాయణ చికెన్ సెంటర్‌కు బారులు తీరారు. కొండేక్కిన ఉల్లిని ఇలా చికెన్‌తో ముడిపెట్టి - ఒకవైపు ఉల్లిని ప్రజలకి అందిస్తూనే ..మరోవైపు తన వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యాపారి ఆలోచనని అందరూ ప్రశంసిస్తున్నారు.