Begin typing your search above and press return to search.

చైనాపై అమెరికా ప్ర‌తీకారం.. హాంకాంగ్‌ పై ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   30 May 2020 9:10 AM GMT
చైనాపై అమెరికా ప్ర‌తీకారం.. హాంకాంగ్‌ పై ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌
X
ప్ర‌త్యేక ప్రాంతంగా ఉన్న హాంకాంగ్‌ను త‌న గుప్పిట్లోకి తీసుకునేందుకు చైనా విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే జాతియ భ‌ద్ర‌త చ‌ట్టంలో కీల‌క మార్పులు చేస్తూ హాంకాంగ్‌ను త‌న చెప్పుచేతుల్లోకి తీసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీనిపై అగ్ర‌రాజ్యం అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా చైనాపై ప్ర‌తీకార చ‌ర్య‌గా హాంకాంగ్‌కు పలు ఆర్థిక ప్రయోజనాలను రద్దు చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచ‌ల‌న ప్రకటన చేశారు. తమ దేశ విశ్వ‌విద్యాల‌యంలో చైనా విద్యార్థులు చేరేందుకు కూడా అనుమతించబోమని స్ప‌ష్టం చేశారు. హాంకాంగ్‌పై చైనా తన జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ చట్టంపై అమెరికాతోపాటు బ్రిటన్ కూడా ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ఆందోళనను, అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మండలిలో చైనాకు స్థానం లేదని ఆ దేశాలు పేర్కొన్నాయి. ఇదే క్ర‌మంలో తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలగుతున్నామని ట్రంప్ ప్రకటించారు. మ‌హ‌మ్మారి వైరస్ విషయంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మ‌రోసారి అమెరికా అధ్య‌క్షుడు ఆరోపించారు. హాంకాంగ్‌ పై చైనా అనుసరిస్తున్న విధానం ప్రపంచ ప్రజలందరికీ ఓ ట్రాజెడీ వంటిదని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. చైనా మిలిటరీతో సంబంధం ఉన్న యూఎస్ విశ్వ‌విద్యాల‌యాల్లో చైనా విద్యార్థులు చేరకుండా చూసేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులను ఈ సంద‌ర్భంగా ట్రంప్ జారీ చేశారు. త‌మ‌ దేశ పారిశ్రామిక రహాస్యాలను దొంగిలించేందుకు చైనా గూఢచర్య కార్యకలాపాలను నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. ఈ విధంగా చైనాపై ప్ర‌తీకార చ‌ర్య‌లు అమెరికా చేప‌ట్టింది. దీంతో ఆ రెండు దేశాల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ‌లాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇరు దేశాల మ‌ధ్య వాగ్యుద్ధం తీవ్ర‌మైంది.