Begin typing your search above and press return to search.

పాక్ కోసం..చైనా బ‌రితెగింపు

By:  Tupaki Desk   |   2 Oct 2016 6:51 AM GMT
పాక్ కోసం..చైనా బ‌రితెగింపు
X
చైనా తన తీరును మార్చుకోలేదు. ఉరీ ఉగ్రవాద దాడి తరువాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ లో భారత్ జరిపిన సర్జికల్ దాడులను యావత్ ప్ర‌పంచం సమర్థిస్తుంటే, చైనా మాత్రం పాకిస్తాన్‌ లోని టెర్రరిస్టులను రక్షించటం మాత్రం మానలేదు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ - జైష్ ఏ మహమ్మద్ నేత మసూద్ అజర్‌ పై నిషేధం విధించాలన్న భారత ప్రతిపాదనకు చైనా మళ్లీ మోకాలడ్డింది. ‘టెక్నికల్ హోల్డ్’ అంటూ సాంకేతిక కారణాలు చూపించి భద్రతామండలి 1267 కమిటీలో మరో మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోకుండా వీటో చేసింది.

జైష్ ఎ మహమ్మద్ సంస్థ ఇప్పటికే ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉంది. ఓ వైపు అమెరికా - యునైటెడ్ కింగ్‌ డమ్ - ఫ్రాన్స్ - భారత్ సహా 14 ఇతర దేశాలు మసూద్‌ పై నిషేధం విధిస్తుంటే, చైనా ఒక్కటే అసాధారణ రీతిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ‘హోల్డ్’ పేరుతో నిలిపించింది. మసూద్ అజర్‌ పై నిషేధం విధించటంలో సహకరించాలంటూ చైనాతో గత ఆరు నెలలుగా భారత్ లాబీయింగ్ చేస్తూనే ఉంది. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. గత మార్చిలో భద్రతామండలిలో చైనా పేర్కొన్న ‘హోల్డ్’ గడువు మరి కొద్ది గంటల్లో ముగిసిపోతుందనగా దీన్ని మరో మూడు నెలల పాటు చైనా పొడిగించింది.

ఇదిలాఉండ‌గా... ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరుకు రష్యా సంపూర్ణ మద్దతు తెలిపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద సంస్థలను కట్టడి చేయడానికి పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని రష్యా సూచించింది. సరిహద్దుల్లో నెలకొన్న అనిశ్చిత వాతావరణం తొలగించడానికి భారత్ - పాకిస్తాన్‌ లు చొరవ తీసుకోవాలని - సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగ్రవాదంపై జరిగే నిర్మాణాత్మక పోరుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని ఓ అధికార ప్రకటనలో వెల్లడించింది. ఉగ్రవాద చర్యలు - వాటిని ప్రేరేపిస్తున్న ఉగ్ర సంస్థలపై పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే భావిస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ఉరీ సైనిక శిబిరంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతిగా భారత్ నిర్వహించి సర్జికల్ దాడి నేపథ్యంలో రష్యా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రోవైపు ఉరీలో 19మంది జవాన్ల మరణానికి కారణమైన దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ‘ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత దేశంగా మారిన పాకిస్తాన్’ తీరును తీవ్రస్థాయిలో ఖండించాలని బ్రిటన్ ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 3875 సంతకాలతో విజ్ఞప్తులు అందాయని యూకే పార్లమెంట్ తన వెబ్‌ సైట్‌ లో పేర్కొంది. ఈ సంతకాలు పదివేలు దాటితే, ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వం తప్పకుండా స్పందనను తెలియజేయాల్సి ఉంటుంది. సంతకాల సంఖ్య లక్ష దాటితే బ్రిటన్ చట్టాల ప్రకారం పార్లమెంటరీ డిబేట్ చేయాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు. ఒసామాబిన్ లాడెన్ పాకిస్తాన్‌ లో తలదాచుకోవటమే ఇందుకు ఉదాహరణ అని అందులో పేర్కొన్నారు. తక్షణం పాకిస్తాన్‌ ను ఏకాకిని చేయాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/