Begin typing your search above and press return to search.

ఐసీఐసీఐలో భారీగా చైనా పెట్టుబడులు.. మరిప్పుడు ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   19 Aug 2020 3:50 PM GMT
ఐసీఐసీఐలో భారీగా చైనా పెట్టుబడులు.. మరిప్పుడు ఏం చేస్తారు?
X
జాతీయవాదం పేరుతో కొన్ని సిత్రమైన వాదనలు వినిపిస్తారు. భారతదేశ ఉత్పత్తుల్ని మాత్రమే కొనండి. దేశాన్ని ప్రగతిపథంలో పయనించేలా సాయం చేయండని చెబుతారు. ప్రపంచీకరణ వేళ.. ఇలా మడి కట్టుకొని కూర్చోవటం సాధ్యమా? అన్నది క్వశ్చన్. ప్రతి చిన్న విషయానికి పక్కనోడి మీద ఆధారపడకుండా ఉండటం మంచిదే. అలా అని.. భూతద్దం వేసుకొని ఫలానా దేశం వారి వస్తువుల్ని కొనద్దంటూ నిర్ణయాలు తీసుకోవటం.. భావోద్వేగంతో కదిలిపోవటం ఎంతవరకు సబబు? అన్న విషయంపై జోరుగా వాదనలు సాగుతుంటాయి.

సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలని.. ఊరికి ఒకటి ఉండే చైనా బజార్లను మూయించటం.. సామాన్లను కొనుక్కునే వేళలో.. మేడిన్ చైనావస్తువుల్ని కొనకుండా ఉండటం లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ సరైనవని భావించే వారంతా.. ఇప్పుడు ఎదురైన పరిస్థితికి ఎలా స్పందిస్తారన్నది ప్రశ్న.

ప్రఖ్యాత ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టటం సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా చైనా బ్యాన్ నడిచే వేళలో.. సదరు ప్రైవేటు బ్యాంకులో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టటాన్ని ఎలా చూడాలి? ఎలా జీర్ణించుకోవాలి? అన్నది క్వశ్చన్. క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందంలో భాగంగా దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో పెట్టుబడులతో భారత మార్కెట్లో హాట్ టాపిక్ గా మారిన చైనా సెంట్రల్ బ్యాంకు తాజాగా ఐసీఐసీఐను ఎంచుకోవటం గమనార్హం.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. చైనాతో మనకున్న సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా వస్తువుల్ని కొనకూడదన్న నిర్ణయం ఓకే అయినప్పడు.. వాడెవడో చైనావాడు బ్యాంకులో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెడతానంటే ఓకే చేయాలా? అన్నది ప్రశ్న. మరి.. అందుకు ఓకే అన్నప్పుడు.. పెట్టిన పెట్టుబడి మీద లాభాలు తన దేశానికి తీసుకెళ్లే చైనాకు..ఆ అవకాశం ఇవ్వకుండా ఐసీఐసీఐ బ్యాంకులోని ఖాతాదారులు తమ ఖాతాల్ని ఉపసంహరించుకుంటారా? అన్నది మరో ప్రశ్న. ఇవన్నీ ఏమీ లేకుండా.. వ్యాపారం వ్యాపారం.. వ్యవహారం వ్యవహారమే అనుకుంటే.. చైనా వస్తువుల మీద అనవసరమైన ఆంక్షల్లో అర్థం ఏముందా? అన్న సందేహం కలుగక మానదు.