Begin typing your search above and press return to search.

మళ్లీ బరితెగించిన చైనా .. ఉత్తరాఖండ్‌ లో ఆ వంతెన ధ్వంసం !

By:  Tupaki Desk   |   29 Sep 2021 8:30 AM GMT
మళ్లీ బరితెగించిన చైనా .. ఉత్తరాఖండ్‌ లో ఆ వంతెన ధ్వంసం !
X
చైనా .. మాటల్లో చూపించే అభిమానం , చేతల్లో ఉండటం లేదు. సరిహద్దు వద్ద తరచూ వివాదాలు సృష్టిస్తున్న చైనా మరోమారు తన దుర్భుద్ధిని చూపింది. గతనెల దాదాపు వందమందికి పైగా చైనా సైనికులు ఎల్‌ ఏ సీ(వాస్తవాధీన రేఖ)ని అతిక్రమించారని ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది. ఉత్తరాఖండ్‌ లోని బారాహటి సెక్టార్‌ లోని ఎల్‌ ఏసీ వద్ద ఆగస్టు 30న సరిహద్దు దాటివచ్చిన చైనా సైనికులు మూడుగంటలకు పైగా గడిపి వెనక్కు వెళ్లారని తెలిపింది. 55 గుర్రాలపై వచ్చిన వీళ్లు అక్కడ ఇండియా ఏర్పరుచుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారని, అక్కడున్న ఒక బ్రిడ్జిని ధ్వంసం చేశారని కథనంలో వెల్లడించింది.

టున్‌ జున్‌ లా కనుమ మార్గం గుండా వచ్చిన చైనా సైనికులు భారతీయ భూభాగంలోకి సుమారు 5 కిలోమీటర్ల వరకు చొచ్చుకువచ్చినట్లు తెలిపింది. ఇదే సమయంలో స్థానికులు నుంచి సమాచారం అందుకొని అక్కడకు ఐటీబీపీ బలగాలు వెంటనే వచ్చాయి. వారు రాకముందే చైనా సైనికులు వెనక్కుపోయారు. చైనా దుశ్చర్యకు ప్రతిస్పందనగా భారతీయ బలగాలు ఇక్కడ పెట్రోలింగ్‌ ఆరంభించాయని సదరు కథనం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాలూ బలగాల ఉపసంహరణకు అంగీకరించినా ఉద్రిక్తతలు చల్లారడం లేదు.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు దాదాపు 3 గంటలపాటు ఈ విధ్వంసకాండకు పాల్పడినట్లు ఈ పత్రిక తెలిపింది. బారాహోటిలోని వంతెనను చైనా సైనికులు ధ్వంసం చేస్తున్నారని స్థానికులు భారతీయ భద్రతా దళాలకు సమాచారం అందించినట్లు తెలిపింది. వెంటనే భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు ఈ ప్రాంతానికి వెళ్ళినట్లు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో టిబెట్ సరిహద్దు 545 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ సెక్టర్‌లో ఉంది. దీనిలో దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై భారత్-చైనా మధ్య వివాదం ఉంది. ఈ భూభాగం ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఉంది. ఉత్తరాఖండ్‌ లోని చమోలీ జిల్లాలో బారాహోటి ఉంది. ఇది చైనా సరిహద్దుల్లో ఉంది. నందా దేవి నేషనల్ పార్క్‌ కు ఉత్తర దిశలో ఉంది. 2017 జూలైలో చైనా సైనికులు రెండుసార్లు ఈ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడ్డారు. అప్పట్లో డోక్లాం వద్ద చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.