Begin typing your search above and press return to search.

హువావేకు ట్రంప్ షాకిస్తే.. యాపిల్ కు చైనీయులు షాకిస్తున్నారు!

By:  Tupaki Desk   |   22 May 2019 12:34 PM GMT
హువావేకు ట్రంప్ షాకిస్తే.. యాపిల్ కు చైనీయులు షాకిస్తున్నారు!
X
ఇవాల్టి రోజు ఎవ‌రు ఎవ‌ర్ని దెబ్బ తీయ‌లేరు. ఒక‌వేళ దెబ్బ తీసే ప్ర‌య‌త్నం చేస్తే..దెబ్బ తీసేటోడు ఎంత న‌ష్ట‌పోతాడో. దెబ్బ ప‌డే వాడు కూడా అంతో ఇంతో న‌ష్టం చేయ‌టం ఖాయం. టెక్నాల‌జీ పుణ్య‌మా అని ప్ర‌పంచం కుగ్రామంగా మారిపోయిన వేళ‌.. ఎవ‌రి అధిప‌త్యం న‌డ‌వ‌దు. ఒక‌రి మీద ఒక‌రు ఆధార‌ప‌డిన వేళ‌..ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణే త‌ప్పించి.. అందుకు భిన్నంగా మాకు మించినోళ్లు లేరంటే మొద‌టికే మోసం వ‌చ్చే ప‌రిస్థితి.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌.. ట్రంప్ కొత్త కొత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అమెరిక‌న్ల‌ను సంతృప్తి ప‌ర్చేలా ఆయ‌న కొత్త త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఓటుబ్యాంకులో కీల‌కంగా ఉండే కొంద‌రిని ఆక‌ర్షించేందుకు ఆయ‌న వేస్తున్న ఎత్తుగ‌డ‌లు కొత్త ఉద్రిక్త‌ల‌కు తావిచ్చేలా ఉన్నాయి.

ఇటీవ‌ల ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష‌లు.. ఆయిల్ ఆంక్ష‌ల సంగ‌తి తెలిసిందే. ఇదిలా ప‌న్ను వ‌డ్డింపు విష‌యంలో చైనా.. అమెరికాల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో గ్లోబ‌ల్ దిగ్గ‌జ మొబైల్ హ్యాండ్ సెట్స్ త‌యారీ సంస్థ హువావే మీద అమెరికా ఆంక్ష‌లు విధించ‌టం.. దానికి స్పందించిన గూగుల్.. త‌న ఓఎస్ ఇచ్చే విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌టం తెలిసిందే.

అంతేకాదు..ట్రంప్ నిర్ణ‌యంతో హువావేతో వ్యాపార సంబంధాలు తెంచుకునేందుకు అమెరిక‌న్ కంపెనీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. దీనికి హువావే అస్స‌లు కంగారు ప‌డ‌టం లేదు. త‌న‌తో పెట్టుకుంటే అమెరికాకే న‌ష్ట‌మ‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే చెప్పినా.. ఆ విష‌యాన్ని అర్థం చేసుకోవ‌టంలో అమెరికా పొర‌పాటు ప‌డిందా? అన్న అనుమానం వ్య‌క్త‌మ‌య్యే ప‌రిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి.

ఎందుకంటే హువామే కు గూగుల్ షాకిచ్చిన నేప‌థ్యంలో హువావే త‌న స‌రికొత్త ఓఎస్ (ఆప‌రేటింగ్ సిస్టం) రూపొందిస్తున్న‌ట్లు చైనా మీడియా చెబుతోంది. ఇది గూగుల్ కు షాక్ గా మారే వీలుంది.ఇప్ప‌టికే గూగుల్ అండ్రాయిడ్‌.. యాపిల్ ఐవోఎస్ లు ఉన్నాయి. ఈ రెండు అమెరికన్ కంపెనీలే. ఇదిలా ఉంటే.. త‌మ దిగ్గ‌జ కంపెనీని దారికి తెచ్చుకునేందుకు ట్రంప్ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చైనీయుల‌కు క‌డుపు మండేలా చేస్తోంది.

అక్కడి యువ‌త ఇప్పుడు అమెరిక‌న్ కంపెనీల‌పై య‌ద్ధం ప్ర‌క‌టిస్తున్నారు. అమెరికాకు చెందిన యాపిల్ ఫోన్లు వాడ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టంతోపాటు.. త‌మ సోష‌ల్ మీడియాలో ఈ విష‌యాన్ని హోరెత్తిస్తున్నారు. ట్విట్ట‌ర్.. వైబో (చైనాలో ఫేమ‌స్ సోష‌ల్ మీడియా) ల ద్వారా త‌మ సందేశాల్ని వారు పోస్ట్ చేస్తున్నారు. ట్రంప్ స‌ర్కారు కావాల‌నే తమ దేశ కంపెనీని అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని మండిప‌డుతున్నారు. ఇందులో భాగంగా అమెరికా యాపిల్ ఫోన్లు కొనే ఆలోచ‌న‌ను చైనీయులు వాయిదా వేసుకుంటున్నారు. అంతేకాదు.. యాపిల్ ఉత్ప‌త్తుల్ని వాడే విష‌యంలోనూ కొత్త త‌ర‌హా ఉద్య‌మం చైనాలో మొద‌లుకానుంది. అదే జ‌రిగితే.. యాపిల్ కు కొత్త త‌ల‌నొప్పి మొద‌లైన‌ట్లే. హువావే.. గూగుల్.. అమెరికా తో మొద‌లైన లొల్లి ఇప్పుడు యాపిల్ కు విస్త‌రించ‌గా.. రానున్న రోజుల్లో ఇదెలా మారుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.