Begin typing your search above and press return to search.

విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన చైనా..!

By:  Tupaki Desk   |   28 Dec 2022 12:30 AM GMT
విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన చైనా..!
X
చైనాలో జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు. వీరి ఆందోళనలకు జడిసిన జిన్ పింగ్ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జీరో కోవిడ్ విధానాన్ని ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయం పట్టుకుంది.

ఒమ్రికాన్.. బీఎఫ్ 7 వేరియంట్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కరోనా కేసులు కోట్లల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ నాటికి చైనాలో కోవిడ్ తో 10 లక్షల మంది మరణిస్తారని అమెరికా అంచనా వేసింది. ఇక చైనాలోని ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషంట్లతో కిక్కిరిసి పోగా శ్మశాన వాటిక మృతదేహాలతో నిండి పోతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇలాంటి సమయంలో తమ దేశంలోకి వచ్చే విదేశీ ప్రయాణీకుల విషయంలో చైనా ఆంక్షలు ఎత్తి వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటిదాకా వరకు విదేశీయులు చైనాకు వెళితే ఐదు రోజులు క్వారంటైన్లో ఉండటం తప్పనిసరి చేసింది. అయితే తాజాగా జిన్ పింగ్ ప్రభుత్వం కరోనా ఆంక్షలు సడలించడంతో ఇకపై విదేశీయులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా పోతుంది.

కాగా ఈ నిబంధన 2023 జనవరి 8 నుంచి అమల్లోకి వస్తుందని చైనా అధికారికంగా స్పష్టం చేసింది. తమ దేశంలోకి విదేశీయులు ఎవరైనా ఎంటర్ అయితే కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. 48 గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని చైనా వెల్లడించింది. అయితే ఒకవైపు చైనాలో లక్షలాదిగా కేసులు నమోదవుతుంటే ప్రభుత్వ కరోనా ఆంక్షలు సడలించడం ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా విదేశీ ప్రయాణికులపై కరోనా ఆంక్షలు ఎత్తి వేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చైనా మాత్రం తమ దేశంలో కరోనా కేసుల వెనుక విదేశీ శక్తి హస్తం ఉందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తమ దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చేందుకే చైనా ఇలా చేస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా చైనాలో కరోనా కేసులు మాత్రం ప్రపంచాన్ని మరోసారి భయపెడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.