Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యం అమెరికా కాదు చైనా .. చైనా ప్రపంచంలోనే ధనిక దేశంగా రికార్డ్ !

By:  Tupaki Desk   |   19 Nov 2021 7:39 AM GMT
అగ్రరాజ్యం అమెరికా కాదు చైనా .. చైనా ప్రపంచంలోనే ధనిక దేశంగా రికార్డ్ !
X
ఇప్పటి వరకు సంపదలో అగ్రస్థానంలో అమెరికా కొనసాగుతూ అగ్రరాజ్యంగా వెలుగొందుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు అమెరికా నుంచి ఆ ట్యాగ్‌ ని చైనా లాగేసుకుంది. చైనా ఇప్పుడు సంపద పరంగా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మారింది. రెండు దశాబ్దాల వ్యవధిలోనే అమెరికాను వెనక్కి నెట్టి చైనా అగ్రస్థానానికి చేరుకుంది. గత రెండు దశాబ్దాల్లో చైనా ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగింది. అతిపెద్ద సంపన్న దేశాలైన చైనా, అమెరికాలలోని మొత్తం సంపదలో దాదాపు 70 శాతం కేవలం 10 శాతం సంపన్న కుటుంబాల చేతుల్లోనే ఉంది. ప్రపంచ ఆదాయంలో 60 శాతం వాటా గల పది దేశాల (ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మెక్సికో, స్వీడన్, బ్రిటన్, అమెరికా) జాతీయ పద్దులను పరిశీలించిన మెకెన్సీ అండ్ కో సంస్థ ఈ నివేదికను రూపొందించింది.

గత రెండు దశాబ్దాలలో ఆర్థిక వ్యవస్థలు ఎత్తుపల్లాల బాటలో పయనిస్తున్నా, ప్రపంచ సంపద మాత్రం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. నిజానికి మన ప్రపంచం ఇంతకు ముందుకంటే సంపన్నంగా మారిందని మెకెన్సీ నివేదిక చెప్తోంది. 2000 సంవత్సరంలో ప్రపంచ సంపద 160 ట్రిలియన్లు కాగా, 2020లో అది 514 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే గత 20 ఏళ్లలో 358 ట్రిలియన్ డాలర్ల సంపద సమకూరింది. ప్రపంచ సంపద పెరుగుదలలో దాదాపు మూడో వంతు వాటా చైనాదే. ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరటానికి ముందు చైనా సంపద 2000 సంవత్సరంలో 7 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. 2021 నాటికి ఆ దేశ సంపద 120 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.మరోవైపు, ప్రపంచ సంపద పెరుగుదలలో అమెరికా వాటా 22 శాతంగా ఉంది. అమెరికా సంపద ఈ 20 ఏళ్లలో 100 శాతానికి పైగా పెరిగి 90 ట్రిలియన్ డాలర్లకు చేరింది.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా సాఫ్ట్‌వేర్, మేధో సంపత్తి హక్కుల వంటి చరాస్తులే నడుపుతున్నాయి. ఇది అంతకంతకూ పెరుగుతోంది కూడా. కానీ, ప్రపంచ సంపదలో అధిక వాటా స్థిరాస్తులదే. దీంతో పొదుపు చేసే మదుపరులు తగినంత ఆర్థిక లాభాలు, దీర్ఘకాలిక విలువను అందించే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నారు. మొత్తం ప్రపంచ సంపదలో 95 శాతం కుటుంబాలదే కావటం మరో విశేషం. అందులో సగం ఇళ్లు, నివాసాల వంటి స్థిరాస్తులు కాగా, మిగతా సగం ఈక్విటీలు, డిపాజిట్లు, పెన్షన్ ఫండ్స్ వంటి ఆర్థిక ఆస్తులుగా ఉన్నాయి. అయితే, అటు చైనాలోనూ, ఇటు అమెరికాలోనూ మొత్తం సంపదలో మూడింట రెండు వంతుల భాగం కేవలం 10 శాతం సంపన్న కుటుంబాల చేతుల్లోనే ఉంది.

అమెరికాలో అగ్రస్థానంలోని 10 శాతం మంది సంపన్నుల చేతుల్లో ఉన్న సంపద 2000 సంవత్సరంలో 67 శాతంగా ఉంటే, 2019 నాటికి అది 71 శాతానికి పెరిగింది.మరోవైపు, అమెరికాలో అట్టడుగునున్న 50 శాతం మంది వాటా 2000 సంవత్సరంలో 1.8 శాతంగా ఉంటే, 2019 నాటికి అది 1.5 శాతానికి తగ్గిపోయింది.ఇక చైనాలో అగ్రస్థాయి 10 శాతం మంది సంపన్నుల చేతుల్లో ఉన్న సంపద 2000 సంవత్సరంలో 48 శాతంగా ఉంటే, 2015 నాటికి అది 67 శాతానికి పెరిగింది.అలాగే చైనాలో దిగువస్థాయిలోని 50 శాతం మంది వాటా 2000 సంవత్సరంలో 14 శాతంగా ఉండగా, 2015 నాటికి అది 6 శాతానికి పడిపోయింది. ప్రపంచంలో అతి పెద్ద సంపన్న దేశంగా, అమెరికాను అధిగమించి అగ్ర స్థానంలో నిలిచింది చైనా. కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సే తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.