Begin typing your search above and press return to search.

వదిలేసిన అమెరికా ..నేనున్నా అంటున్న చైనా !

By:  Tupaki Desk   |   24 April 2020 12:30 AM GMT
వదిలేసిన అమెరికా ..నేనున్నా అంటున్న చైనా !
X
కరోనా మహమ్మారి పై పోరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ కు అండగా నిలిచేందుకు 30 మిలియన్‌ డాలర్ల విరాళం అందజేస్తున్నట్లు చైనా ప్రకటించింది. ప్రాణాంతక వైరస్‌ ను కట్టడి చేసేందుకు ఈ మేరకు సాయం అందిస్తున్నట్లు గురువారం చైనా తెలిపింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కి కారణం చైనానే అని, చైనా కి మద్దతుగా నిలిచిన ప్రపంచ ఆరోగ్య సంస్థకి అమెరికా నిధులు నిలిపేసింది. కరోనా వ్యాప్తికి కారణమైన చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెనకేసుకొని వస్తుందని.. దీని వలన కరోనా వ్యాప్తి మరింత తీవ్రమవుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ సంస్థకు నిధులను నిలిపివేశారు.

ఏడాదికి 400 నుంచి 500 మిలియన్‌ డాలర్ల చొప్పున సంస్థకు తాము నిధులు కేటాయిస్తుంటే, చైనా మాత్రం కేవలం 40 మిలియన్‌ డాలర్లు లేదా అంతకన్నా తక్కువే అందిస్తోందని ఆయన విమర్శించారు. అటువంటి దేశానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతుగా నిలిచి ఇంతటి సంక్షోభానికి పరోక్ష కారణమైందంటూ దుయ్యబట్టారు. దీంతో డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల కొరత లేకుండా చైనా చర్యలు తీసుకుంటుంది.దీనికి అనుగుణంగా 30 మిలియన్ డాలర్ల నిధులనుకేటాయిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, మార్చి 11న 20 మిలియన్ల డాలర్ల సహాయం చేసిన చైనా తాజాగా మరో మరో 30 మిలియన్ డాలర్లను విడుదల చేస్తామని ప్రకటించింది. కరోనా కల్లోల పరిస్థితుల్లో ఆదుకోవడమంటే ఐక్యతను చాటడమే అని చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇక నిధుల నిలిపివేతపై అమెరికా పునరాలోచన చేస్తుందని డబ్ల్యూహెచ్‌ ఓ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అమెరికా నిర్ణయంపై స్పందించిన డబ్ల్యూహెచ్ ‌ఓ అత్యవసర విభాగం చీఫ్‌ మైక్‌ ర్యాన్‌.. నిధుల కొరత సంస్థ ప్రధాన కార్యకలాపాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. వివిధ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ దేశం తాజాగా 30 మిలియన్‌ డాలర్లు డబ్ల్యూహెచ్ ‌ఓకు విడుదల చేయడం గమనార్హం.