Begin typing your search above and press return to search.

'మధుమేహం'లో పోటీపడుతున్న చైనా.. భారత్..!

By:  Tupaki Desk   |   18 Dec 2022 7:35 AM GMT
మధుమేహంలో పోటీపడుతున్న చైనా.. భారత్..!
X
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా చైనా.. భారత్ ముందు వరుసలో నిలుస్తున్నారు. 2023 చివరి నాటి కల్లా జనాభా విషయంలో భారత్ చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంటుందని ఐరాస అంచనా వేసింది. జనాభా విషయంలో చైనా.. భారత్ మధ్య పోటీ పడుతున్నట్లుగానే మధుమేహం వ్యాధిలోనూ ఈ రెండు దేశాలు పోటీ పడుతుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది.

మధుమేహం.. షుగర్.. డయాబెటిస్ ఇలా ఏ పేరుతో పిలిచినా ఈ వ్యాధి ప్రతి యేటా దూకుడు పెంచుతోంది. జనాభా మాదిరిగానే షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా చైనా.. భారత్ లో క్రమంగా పెరిగి పోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం డయాబెటిస్ రోగుల సంఖ్య 141 మిలియన్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ 77 మిలియన్ల మధుమేహ రోగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

2020 సంవత్సరంలో డయాబెటిస్ తో ఏడు లక్షల మంది చనిపోయినట్లు ఐసీఎంఆర్ గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహ బాధితుల్లో కేరళ 19.8శాతంతో మొదటి స్థానంలో ఉందని వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో 13.6శాతంతో చంఢీగడ్.. తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్ లు 8.9శాతంతో ఉన్నాయి. తెలంగాణలోనూ ప్రతి వంద మందిలో తొమ్మిది మందికి డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

2045 నాటికి భారత్ లో మధుమేహ బాధితుల సంఖ్య 135 మిలియన్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది. వీరిలో మహిళలు 40 శాతం ఈ వ్యాధి బారిన పడనుండగా.. పురుషులు 60 శాతం మంది ఈ వ్యాధి బారిన పడనున్నారని డబ్యూహెచ్ఓ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీయులు మధుమేహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధుమేహం అనేది స్థూలకాయం.. వ్యాయాయం సరిగ్గా చేయకపోవడం.. జంక్ ఫుడ్స్ తినడం.. వేళకు ఆహారం తీసుకోకపోవడం.. వంశ పారంపర్యం.. పని ఒత్తిడి.. జీవన శైలిలో మార్పులు చోటు చేసుకోవడం వంటి కారణాలతో వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రతి ఇద్దరు మధుమేహుల్లో ఒకరు తనకు ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించలేక పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కూడా షుగర్ పేషెంట్ల సంఖ్య యేటా గణనీయంగా పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.