Begin typing your search above and press return to search.

చైనాలో 2 రోజులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు

By:  Tupaki Desk   |   8 Dec 2015 1:41 PM GMT
చైనాలో 2 రోజులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు
X
చైనాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అది కూడా.. రెండు రోజుల పాటు. బీజింగ్ నగరంలోని ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. వస్తే.. ఆరోగ్యానికి ప్రమాదమంటూ హెచ్చరిస్తున్నారు. దాదాపుగా 2.5కోట్ల మంది జనాభా ఉండే బీజింగ్ నగరంలో రెడ్ అలెర్ట్ ప్రకటించటానికి కారణం.. ఉగ్రవాదులు.. భయపెట్టే టోర్నిడోలు.. ఉక్కిరిబిక్కిరి చేసే భారీ వర్షాలు కాదు.. వాయు కాలుష్యం.

మనలాంటి దేశంలో అయితే.. చాలామందికి వాయు కాలుష్యంతో రెండు రోజులు సెలవులు ప్రకటించారంటే కాస్త చిత్రంగా చూస్తారు కానీ.. బీజింగ్ మహానగరంలో భారీగా పెరిగిపోయిన వాయు కాలుష్యంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించి.. జనాల్ని ఇళ్లు కదిలి రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. మరీ.. తప్పదంటే రావాలని.. అయితే.. బయటకు వస్తే మాత్రం అది ఆరోగ్యానికి చేటు చేస్తుందని తేల్చి చెబుతున్నారు.

ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడో.. సునామీలు.. భారీ తుఫానులు లాంటి భారీ విపత్తులు చోటు చేసుకున్నప్పుడు రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు కానీ.. వాయు కాలుష్యం కారణంగా రెండు రోజులు రెడ్ అలెర్ట్ ప్రకటించటం చాలా అరుదు. చైనాలో అయితే.. ఇదే తొలిసారి అని చెబుతున్నారు. వాయు కాలుష్యానికి కారణం అవుతున్న.. బొగ్గు ఆధారిత పరిశ్రమలతో పాటు.. భవన నిర్మాణాలతో సహా అన్ని పనుల్ని ఆపేస్తున్నారు. అలా చేస్తే.. రెండు రోజుల్లో పరిస్థితి కాస్త మెరుగు కావొచ్చని భావిస్తున్నారు.

ఇక.. బీజింగ్ మహానగరంలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆఫీసులదీ అదే బాట. ప్రభుత్వం ప్రకటించిన రెడ్ అలెర్ట్ కు బీజింగ్ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. బీజింగ్ లో కాలుష్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. 660 అడుగుల దూరంలో ఉన్న వస్తువలు కనిపించని దుస్థితి చోటు చేసుకుందట. ప్రకృతి విషయంలో మనిషి చేసిన తప్పులకు.. మళ్లీ అతడే ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో కదా. కాలుష్యం విషయంలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే వారంతా ఒక రోజు అటూ ఇటూగా బీజింగ్ బాట పట్టాల్సిందేనేమో.