Begin typing your search above and press return to search.

మూడు పిల్లులకు పాజిటివ్.. ఆ పాడు దేశం చంపేసింది

By:  Tupaki Desk   |   30 Sep 2021 4:37 AM GMT
మూడు పిల్లులకు పాజిటివ్.. ఆ పాడు దేశం చంపేసింది
X
ప్రపంచానికి కరోనా మహమ్మారిని తగిలించిన డ్రాగన్ దేశం కారణంగా వందల కోట్ల మంది ప్రజలు ఎంతలా ఇబ్బందులు పడ్డారన్న సంగతి తెలిసిందే. ప్రపంచ గమనాన్ని పూర్తిస్థాయిలో ప్రభావితం చేయటమే కాదు.. స్తంభించిపోయేలా చేసిన మహమ్మారి తీవ్రత గురించి సరైన రీతిలో హెచ్చరికలు చేయని తీరును ఎంత తప్పు పట్టినా తక్కువే అవుతుంది. ఆ దేశంలో కరోనా కేసుల్ని పూర్తిస్థాయిలో కంట్రోల్ చేసినా.. తగ్గినట్లే తగ్గి మళ్లీ ఎక్కువ అవుతున్న పరిస్థితి. దీంతో..ఆ దేశం కేసుల సంఖ్యను నియంత్రణలోకి తీసుకురావటానికి దారుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి సైతం వెనుకాడటం లేదు.

తాజాగా అలాంటి పనే చేసిన చైనా.. ప్రపంచానికి షాకిచ్చింది. తాజాగా ఉత్తర చైనాలోని హార్బిన్ పట్టణానికి చెందిన మూడు పిల్లులకు కరోనా పాజిటివ్ సోకినట్లుగా తేలింది. దీంతో.. ఆ పిల్లుల్ని వెనుకా ముందు ఆలోచించకుండా అధికారులు చంపేశారు. ఈ ఉదంతం పెద్ద చర్చకు తెర తీస్తోంది. ఈ పిల్లుల్నిచంపకుంటే.. వాటి యజమానులకు.. అపార్ట్ మెంట్ వాసులకు ప్రమాదం పొంచి ఉందని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే చంపాల్సి వచ్చినట్లుగా చైనా అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంలో అసలేం జరిగిందన్న విషయాల్లోకి వెళితే..కొత్త విషయాలు వెలుగు చూస్తాయి. చంపేసిన పెంపుడు పిల్లుల యజమానికి ఈ నెల 21న పాజిటివ్ గా తేలింది. దీంతో.. సదరు మహిళను ఐసోలేషన్ లో ఉంచారు. దీంతో.. ఆమె పెంచుకుంటున్న మూడు పిల్లలకు వైద్యాధికారులకు పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ మూడు పిల్లులకు సైతం కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో..మనుషులకు మాత్రమే సోకే కరోనా.. కొన్ని సందర్భాల్లో మనుషుల ద్వారా జంతువులకు ద్వారా సోకే ప్రమాదం ఉందన్న విషయాన్ని అమెరికా వ్యాధి నియంత్రణ.. నివారణ కేంద్రం స్పష్టం చేస్తోంది.

ఈ కారణంతోనే కరోనా సోకినప్పుడు.. రోగ తీవ్రత ఉన్నప్పుడు.. ఆ లక్షణాలు బయటపడిన వెంటనే.. పెంపుడు జంతువుల్ని దూరంగా ఉంచాలని చెబుతున్నారు. కొవిడ్ పై మన దేశంలో ఆంక్షలు అంతకంతకూ తగ్గిపోతుంటే.. అందుకు భిన్నంగా చైనా మాత్రం.. కొద్దిపాటికేసుల విషయంలోనూ చాలా కఠినంగా వ్యవహరిస్తూ.. కేసుల తగ్గించటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు.

కరోనాకు పుట్టిల్లు అయిన చైనాలో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే.. ఆ ప్రాంతంలో మొత్తంలో కఠినంగా నిబంధనల్ని అమలు చేస్తున్నారు. బయటకు ఎవరిని రానివ్వటం లేదు. అంతేకాదు.. సదరు ప్రాంతంలో వీలైనంత మందికి కొవిడ్ టెస్టులు చేయిస్తూ.. ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కరోనా పుట్టింట్లో.. మాయదారి మహమ్మారిని కంట్రోల్ చేసే కసరుత్తుల తీరు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.