Begin typing your search above and press return to search.

భారత్ భూమిని కబ్జాచేస్తున్న డ్రాగన్

By:  Tupaki Desk   |   20 July 2022 7:30 AM GMT
భారత్ భూమిని కబ్జాచేస్తున్న డ్రాగన్
X
మన దేశంలోని భూభాగంపై డ్రాగన్ దుశ్చర్యలకు పాల్పడుతోంది. మెల్లిమెల్లిగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించేస్తోంది. ఒకవైపు డ్రాగన్ భారత్ భూభాగాన్ని ఆక్రమించేస్తున్న మన సైన్యం చోద్యం చూస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

తాజాగా డోక్లామ్ పీఠభూమికి చేరుకోవటానికి చైనా ప్రభుత్వం ఏకంగా పది కిలోమీటర్ల రోడ్డును వేసేసింది. మన భూభాగాలను అక్రమిస్తు మరోవైపు గ్రామాలకు గ్రామాలనే నిర్మించేస్తోంది. అయినా మనసైన్యం ఏమి చేయలేకపోతోంది.

చైనా ఆక్రమణలను శాటిలైట్ ఫొటోలు, వీడియోలు బయటపెట్టాయి. భారత్ కు ఎంతో కీలకమైన శిలిగురి ప్రాంతాన్ని ఆక్రమించేందుకు డ్రాగన్ ఎప్పటినుండో ప్రయత్నిస్తోంది. 2017లో డోక్లామ్ పీఠభూమిని ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తే దాన్ని మన సైన్యం గట్టిగా అడ్డుకుంది. ఆ సమయంలో రెండువైపుల నుండి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చేసేదిలేక అప్పుడు చైనా సైన్యం వెనక్కుతగ్గింది.

ఆ తర్వాత కొంతకాలం కామ్ గా ఉన్న డ్రాగన్ సైన్యం చడీచప్పుడు లేకుండానే డోక్లామ్ కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూటాన్ భూభాగంలో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించేసింది. అప్పట్లో ఈ గ్రామం సైనికావసరాలకు మాత్రమే అని ప్రకటించినా ఇపుడు మామూలు జనాలు కూడా నివసిస్తున్నారు.

చాలా ఇళ్ళముందు కార్లు కూడా కనబడుతున్నాయి. అంటే చైనా చెప్పేదొకటి చేసేదొకటని మరోసారి నిరూపణైంది. ఈ గ్రామం చుట్టుపక్కల చైనా సరిహద్దుల నుండి చాలా రోడ్లు కనబడుతున్నాయి. అంటే సైనిక వాహనాల రాకపోకలకు పక్కా రోడ్లను ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

డోక్లామ్ ప్రాంతంలోని జంపేరి పర్వతం దగ్గరకు సులభంగా చేరుకోవటానికి వీలుగా రోడ్లను వేయాలనేది డ్రాగన్ ప్లాన్. ఇందులో భాగంగానే పర్వతం చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించి రోడ్లను వేసేస్తోంది. ఒకసారి జంపేరి పర్వతాన్ని గనుక చైనా ఆక్రమించుకుంటే మనకు ఇబ్బందులు తప్పవు. ఒకవైపు చైనా భూటాన్ తో పాటు మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ఒక్కొక్క అడుగు వేస్తుంటే మన సైన్యం ఏమి చేస్తున్నదో అర్ధం కావటంలేదు.