Begin typing your search above and press return to search.

ఔరా చైనా..48 గంట‌ల్లో ఆసుప‌త్రి రెడీ

By:  Tupaki Desk   |   30 Jan 2020 1:30 AM GMT
ఔరా చైనా..48 గంట‌ల్లో ఆసుప‌త్రి రెడీ
X
గ్గ్రేట్ వాల్ ఆఫ్ చైనా స‌హా ఎన్నో అద్భుత నిర్మాణాల‌తో ప్ర‌పంచాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌డం చైనీయుల‌కు అల‌వాటే. ఐతే ఇప్పుడు చేసింది అద్భుతాల్లోకెల్లా అద్భుతం. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి వ‌స్తే చైనీయులు ఎంత చురుగ్గా ప‌ని చేస్తారో చెప్ప‌డానికి తాజా ఉదంతం నిద‌ర్శ‌నం. కేవ‌లం 48 గంటల వ్య‌వ‌ధిలో చైనా ఒక పెద్ద భ‌వ‌నాన్ని ఆసుప‌త్రిగా తీర్చిదిద్ది అబ్బుర‌ప‌రిచింది. ఆ దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌టం.. ఇప్ప‌టికే వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవ‌డం తెలిసిన సంగ‌తే. ఈ మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా యుద్ధ ప్రాతిప‌దిక‌న ఒక ఆసుప‌త్రిని సిద్ధం చేయాల‌ని ప్ర‌భుత్వం భావించింది. అనుకున్న‌దే త‌డ‌వుగా స‌న్నాహాలు మొద‌లుపెట్టి 48 గంట‌ల్లోనే ఆసుప‌త్రిని సిద్ధం చేసింది.

అప్ప‌టికే నిర్మాణం పూర్త‌యిన‌ ఓ భ‌వ‌నాన్ని తీసుకుని దాన్ని రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఆసుప‌త్రిగా మార్చారు చైనీయులు. నిర్మాణంలో ఉన్న భారీ భ‌వ‌నాన్ని ఎంచుకుని.. 500 మంది నిర్మాణ కార్మికులు - పోలీసులు అకుంఠిత దీక్షతో ప‌ని చేసి.. 1000 పడకల డెబీ మౌంటెన్ రీజనల్ మెడికల్ సెంటర్‌ గా తీర్చిదిద్దారు. నిజానికి ఆసుపత్రి కోసమే ఈ భవనాన్ని నిర్మించినప్పటికీ - సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం మే నెలను డెడ్ లైన్‌ గా పెట్టుకున్నారు. ఐతే కరోనా వైర‌స్ తీవ్రత దృష్ట్యా నిర్మాణ పనులను వేగిరం చేసిన ప్రభుత్వం కేవలం 48 గంటల్లో ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఇక కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన వూహాన్ నగరంలో ఇంతకంటే భారీ ఆసుపత్రిని ప్రారంభించే క్రమంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.