Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మీద దాడిపై ఇంత నిర్ల‌క్ష్య వ్యాఖ్య‌లా చిన‌రాజ‌ప్ప‌

By:  Tupaki Desk   |   25 Oct 2018 10:33 AM GMT
జ‌గ‌న్ మీద దాడిపై ఇంత నిర్ల‌క్ష్య వ్యాఖ్య‌లా చిన‌రాజ‌ప్ప‌
X
ఒక రాష్ట్ర విప‌క్ష నేత మీద ఎయిర్ పోర్ట్ లో క‌త్తితో దాడి చేశారన్న సీరియ‌స్ అంశంపై ఎలా స్పందించాల‌న్న అంశంపైనా ఏపీ హోంమంత్రికి అవ‌గాహ‌న లేద‌న్న విష‌యం తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతున్నాయి. తీవ్ర‌భావోద్వేగంతో కూడిన ఈ అంశంపై మాట్లాడేట‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. అదేమీ లేకుండా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

జ‌గ‌న్ మీద జ‌రిగిన క‌త్తి దాడిపై ఏపీ హోంమంత్రి రియాక్ట్ అవుతూ.. జ‌గ‌న్ బాధ్య‌త‌తో ఉండాల్సిన అవ‌స‌రంఉంద‌ని నీతులు చెప్పే ప్ర‌య‌త్నం చేశారే కానీ.. భ‌ద్ర‌తా వైఫ‌ల్యం గురించి మాట్లాడ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ పై దాడి నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప‌ది నిమిషాలు మాట్లాడిన చిన‌రాజ‌ప్ప బాధ్య‌తారాహిత్యంతో మాట్లాడిన‌ట్లుగా ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

దాడులు ఎవ‌రి మీద జ‌రిగినాఖండించాల్సిందేన‌ని.. దాడి చేసిన శ్రీ‌నివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశార‌ని.. ఇంట‌రాగేష‌న్ జ‌రుగుతోంద‌ని.. గంట‌లో వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్నారు. దాడి వెనుక ఎవ‌రైనా ఉన్నారా? అన్న విష‌యాన్ని గంట‌లో చెబుతామ‌న్నారు. దాడి చేసిన శ్రీ‌నివాస్ తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం గ్రామానికి చెందిన వ్య‌క్తిగా హోంమంత్రి చెప్పారు. పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ త‌నతో ఎవ‌రు సెల్ఫీ దిగాల‌ని వ‌చ్చినా వారితో వెళ‌తారంటూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. నిందితుడు శ్రీ‌నివాస్ సైతం సెల్ఫీ తీసుకుంటాన‌ని జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి దాడి చేసే య‌త్నం చేశార‌ని గుర్తు చేశారు. దాడి జ‌రిగిన‌ప్పుడు గుడ్డు మీద ఈక‌లు పీకిన‌ట్లు కాకుండా.. బాధిత వ‌ర్గాల‌కు సాంత్వ‌న క‌లిగేలా మాట్లాడాల‌న్న విష‌యాన్ని చిన‌రాజ‌ప్ప మిస్ కావ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రోవైపు ఇదే అంశంపై ఏపీ డీజీపీ ఠాకూర్ ప్రెస్ మీట్ పెట్టి దాడి వివ‌రాల్ని వెల్ల‌డించారు. దాడి చేసిన శ్రీ‌నివాస్ ఇంట‌ర్ చ‌దివే వాడ‌ని.. మ‌ధ్య‌లో మానేశాడ‌ని.. ఏడాది నుంచి ఎయిర్ పోర్ట్ క్యాంటిన్ లో ప‌ని చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. నిందితుడిని సీఐఎస్ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని.. పూర్తిస్థాయిలో త‌నిఖీ చేసిన‌ట్లు చెప్పారు. అత‌డి జేబులో లేఖ దొరికిన‌ట్లు చెప్పారు. అయితే.. లేఖ‌ను డీజీపీ బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఆ లేఖ‌లో ఉన్న విష‌యాల్ని త‌ర్వాత ప్ర‌స్తావిస్తామ‌న్నారు. ప్రెస్ మీట్ ను ముగించే స‌మ‌యంలో మాత్రం దాడి చేసిన శ్రీ‌నివాస‌రావు జ‌గ‌న్ వీరాభిమానిగా అని త‌మ ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలిన‌ట్లుగా చెప్పారు. ఎంత వీరాభిమాని అయినా.. ఎంత సంచ‌ల‌నం కోసం ట్రై చేసే వారైనా.. తాము అమితంగా ఇష్ట‌ప‌డి.. ఆరాధించే వ్య‌క్తుల మీద క‌త్తుల‌తో దాడి చేస్తారా? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఏమైనా.. ఏపీ హోంమంత్రి.. రాష్ట్ర డీజీపీ ల ప్రెస్ మీట్ల సంద‌ర్భంగా వారు చేసిన వ్యాఖ్య‌ల్లో కొన్నింటిపై అభ్యంత‌రం వ్య‌క్త‌మవుతున్నాయి.