Begin typing your search above and press return to search.

భార‌త్ చ‌ర్య‌పై చైనా స్పంద‌న: కిట్ల నిషేధంపై కంపెనీల కాళ్ల‌బేరం

By:  Tupaki Desk   |   28 April 2020 4:01 PM IST
భార‌త్ చ‌ర్య‌పై చైనా స్పంద‌న: కిట్ల నిషేధంపై కంపెనీల కాళ్ల‌బేరం
X
నాసిర‌కం, నాణ్య‌త లేని చైనా కంపెనీల‌కు సంబంధించిన క‌రోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల‌ను వాడొద్ద‌ని భార‌తదేశం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు చైనా దేశానికి చెందిన కంపెనీల కరోనా రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను వాడొద్దన్న భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) రాష్ట్రాల‌కు సూచ‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై 24 గంట‌ల్లోపే చైనా స్పందించింది. త‌మ కంపెనీల నిషేధంపై పున‌రాలోచించాల‌ని, త‌మ‌వి నాణ్య‌మైన ప‌రిక‌రాల‌ని స్ప‌ష్టం చేసింది. వైద్య పరికరాల నాణ్యత విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ క్ర‌మంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల పనితీరుపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఐసీఎంఆర్‌తో చైనా రాయబార కార్యాలయం సంప్రదింపులు చేస్తోంద‌ని చైనా తెలిపింది. త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చైనా రాయబారి జీ రోంగ్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

చైనాకు చెందిన గువాంగ్‌జో వండ్ఫో బయోటెక్‌, జుహాయ్‌ లివ్సోన్‌ డయాగ్నస్టిక్స్‌ అనే కంపెనీలకు చెందిన రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు ఉన్నాయి. వాటిని భార‌త‌దేశం వినియోగిస్తోంది. అయితే కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు ఆ కిట్లు ఇవ్వడం లేదని ఐసీఎంఆర్ గుర్తించింది. ఈ మేర‌కు దిద్దుబాటు చ‌ర్య‌లు భార‌త్ ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే ఆ కంపెనీల‌కు చెందిన కిట్ల‌ను వాడ‌రాద‌ని సోమవారం రాష్ట్రాల‌కు ఆదేశించింది. ఆ రెండు కంపెనీల నుంచి కిట్లు కొనవద్దని, కొని ఉంటే వాటిని వాడొద్ద‌ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఆ కంపెనీలకు ఒక్క పైసా కూడా చెల్లించబోమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఈ ప‌రిణామంతో చైనా రాయ‌బారి జీ రోంగ్ మంగళవారం స్పందించారు. ఆ రెండు కంపెనీల టెస్టింగ్‌ కిట్లకు చైనా జాతీయ వైద్య ఉత్పత్తుల పాలనా విభాగం (ఎన్‌ఎంపీఏ) నుంచి సర్టిఫికేషన్‌ లభించిందని తెలిపారు. భారత్‌లోని పుణెలో ఉన్న జాతీయ వైరాలజీ సంస్థ వీటిని పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసి ఆమోదముద్ర వేసిందని రాయ‌బారి వెల్ల‌డించారు. రాపిట్‌ టెస్టింగ్‌ కిట్ల స్టోరేజీ, రవాణా, వాడకంలో జాగ్రత్తలు పాటించకపోతేనే ఆ కిట్ స‌క్ర‌మంగా పని చేసి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని వివ‌రించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది చైనా ఉత్పత్తులు నాసిరకానికి చెందినవని ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆ రాయ‌బారి ఆ ప్ర‌క‌ట‌న‌లో.. చైనా గుడ్‌విల్‌, సిన్సియారిటీని భారత్‌ గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలను గమనించి చైనా కంపెనీలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుక్కోవాల‌ని సూచించారు. వైరస్‌లు మానవాళి ఉమ్మడి శత్రువులని పేర్కొన్నారు. మనమంతా ఒక్కటిగా పోరాడితేనే క‌రోనాపై విజయం సాధించగలమ‌ని గుర్తుచేశారు. ఈ పోరులో భారత‌దేశానికి ఎప్పుడూ అండగా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.