Begin typing your search above and press return to search.

ఉత్త‌ర కొరియా తొలి దెబ్బ చైనాకి త‌గిలిందే!

By:  Tupaki Desk   |   12 Sep 2017 11:27 AM GMT
ఉత్త‌ర కొరియా తొలి దెబ్బ చైనాకి త‌గిలిందే!
X
అవున‌ట‌! అమెరికాపై పంతం, ప‌ట్టుద‌ల ప్ర‌తీకారంతో రెచ్చిపోయిన ఉత్త‌ర కొరియా.. తాను జ‌రిపిన ప్ర‌యోగంతో మిత్ర దేశం చైనాకి ఎర్త్ పెట్టింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక ప‌క్క అమెరికా.. ఉత్త‌ర కొరియాపై ఆంక్షల బాంబులు ప్ర‌యోగించేందుకు సిద్ధ‌ప‌డుతుండ‌గా.. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో చైనా ఉత్త‌ర‌కొరియాను బ‌లంగా వెనకేసుకు వ‌స్తోంది. ఇలాంటి ప‌రిస్థితిలో ఉత్త‌ర కొరియా.. చైనాకు ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌డం, ఆదేశాన్ని భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యేలా చేయ‌డం ఏమిట‌నే వాద‌న తెర‌మీద‌కి వ‌చ్చింది. మ‌రి అస‌లు విష‌యం ఏంటో తెలుసుకుందాం ప‌దండి.

ఇటీవ‌ల అమెరికాకు త‌న త‌ఢాకా ఏంటో చూపించాల‌ని భావించిన ఉత్తరకొరియా హైడ్రోజ‌న్ బాంబు ప్ర‌యోగించింది. అయితే, ఈ బాంబు ఎఫెక్ట్ చైనా సరిహద్దు ప్రాంతాలను తాకే ప్రమాదం ఉంద‌ని ఇప్పుడు ఆందోల‌న వ్య‌క్తం అవుతోంది. ఉత్తరకొరియా లోని పుంగె-రి కొండల్లో ఉన్న సొరంగంలో నిర్వహించిన హైడ్రోజన్‌ బాంబు ప్రయోగం ఫలితంగా ఆ సొరంగం కూలిపోయి, కొండ బీటలువారింది. అయితే ఆ పేలుడు నుంచి వెలువడిన రేడియో ధార్మిక ఉద్గారాలు చైనాలోకి వచ్చే ప్రమాదం ఏర్పడింద‌ని అమెరికా ర‌క్ష‌ణ వ్య‌వ‌హారాల విశ్లేష‌ణా సంస్థ నిపుణులు చెబుతున్నారు.

ఇదే ప్రాంతంలో ఉత్తరకొరియా గనుక మరో అణుపరీక్షకు సిద్దపడితే చైనా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా అంటున్నారు. రేడియో ధార్మిక ఉద్ఘారాలు చైనాలోకి వ్యాపిస్తే.. దాని ప్రభావంతో వేలమంది ప్రజలు చనిపోయే ప్రమాదముంద‌ని చెబుతుండ‌డం ఇప్పుడు మ‌రింత ఆందోళ‌న‌కు దారితీస్తోంది. అమెరికాకు చెందిన రాన్డ్ కార్పొరేషన్ అనే రక్షణ వ్యవహారాల విశ్లేషణా సంస్థ ఉత్త‌ర కొరియా జ‌రిగిన హైడ్రోజ‌న్ బాంబు త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం జ‌రిపింది.

ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా-చైనా సంబంధాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికైనా ఐక్య‌రాజ్య‌స‌మితి చెప్పినట్లు ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలను వదులుకుని చైనా ఆ దేశానికి బుద్ది చెబుతుందా? లేక ఆర్థికంగా సహకరిస్తూ తన ఉనికికే ముప్పు తెచ్చుకుంటుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చైనా మాత్రం హైడ్రోజన్ బాంబు ఎఫెక్ట్ తమ దేశంపై లేదని చెప్పుకురావడం గమనార్హం. సరిహద్దు వెంబడి ఆ ప్రభావమేమి కనిపించలేదని చైనా వాతావరణ రక్షణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ ప‌రిణామంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.