Begin typing your search above and press return to search.

యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న చైనా?

By:  Tupaki Desk   |   17 Aug 2017 4:44 PM GMT
యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న చైనా?
X
రెండు నెల‌లుగా భార‌త్‌ - చైనాల మ‌ధ్య డోక్లామ్ స‌రిహ‌ద్దు వివాదం ర‌గులుతున్న సంగ‌తి తెలిసిందే. ఇరు దేశాలు త‌మ సైన్యాన్ని డోక్లామ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద మోహ‌రించాయి. చైనా కుటిల బుద్ధితో మంగళవారం లడక్ ప్రాంతంలోకి ప్ర‌వేశించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాల‌ను భార‌త సైన్యం తిప్పికొట్టింది. డ్రాగ‌న్ చ‌ర్య‌ల‌కు దీటుగా బ‌దులు చెప్పేందుకు డోక్లామ్ స‌రిహ‌ద్దులో ఉన్న గ్రామాల ప్రజలను భారత సైన్యం ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మ‌రోవైపు క‌య్యాన‌నికి కాలు దువ్వుతున్న‌ చైనా డోక్లామ్ స‌మీపంలోని ఓ ఆసుప‌త్రిలో బ్ల‌డ్ డొనేష‌న్ క్యాంప్ ఏర్పాటు చేసి ర‌క్త సేక‌ర‌ణ చేప‌ట్టిన‌ట్లు గ్లోబ‌ల్ టైమ్స్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన డ్రాగ‌న్ దేశం భార‌త్ తో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు సంకేతాలు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ఇరు దేశాల మ‌ధ్య ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ ఏ) చర్యలు ఆసక్తికరంగా మారాయి. పిఎల్ ఏ ఆదేశాల ప్ర‌కారం హూనన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలోని ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని పునః ప్రారంభించిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ ర‌క్త‌దాన శిబిరం డోక్లామ్ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. దీంతోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో రక్త వినియోగాన్ని నియంత్రించాల‌ని ఆదేశాలిచ్చిన‌ట్లు తెలుస్తోంది. డోక్లాం వివాదంపై చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని భార‌త్ భావిస్తోంది. చైనా చ‌ర్య‌లు కూడా స‌మ‌స్య‌ను మ‌రింత జ‌టిలం చేసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య ఏ క్షణాన్నైనా యుద్ధం మొదలు కావ‌చ్చ‌ని విదేశీ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

డోక్లామ్ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలు చొరవ చూపడం లేదని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది. ఇరు దేశాలు పరస్పరం రెచ్చగొట్టుకుంటూ సమస్యను మరింత జఠిలంగా మార్చుకుంటున్నాయని ఆ పత్రిక ఆరోపించింది. డోక్లామ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘ‌ర్ష‌ణ‌లు కూడా మొద‌ల‌య్యాయ‌ని, ఇది మంచి ప‌రిణామం కాద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొంది. ఆ గొడ‌వ‌లు చినికి చినికి గాలి వానై సైనికుల మధ్య కాల్పులకు దారితీసి యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. యాభై ఏళ్లుగా ఎన్న‌డూ లేనంత‌గా స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని తెలిపింది. ప‌రిస్థితులు ఇదే ర‌కంగా కొన‌సాగితే భార‌త్‌ - చైనా ల మ‌ధ్యం యుద్ధం త‌ప్ప‌ద‌ని ఆ ప‌త్రిక పేర్కొంది.