Begin typing your search above and press return to search.

రేపు భూమిని ఢీకొన‌బోతోన్న‌`టియాన్ గాంగ్-1`?

By:  Tupaki Desk   |   31 March 2018 4:56 PM GMT
రేపు భూమిని ఢీకొన‌బోతోన్న‌`టియాన్ గాంగ్-1`?
X
మొట్ట‌మొద‌టిసారిగా 2011లో చైనా ప్ర‌యోగించిన స్పేస్ స్టేష‌న్ `టియాన్ గాంగ్-1` అదుపు త‌ప్పి భూమిని ఢీకొట్ట‌బోతోంద‌న్న సంగ‌తి తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 5వ తేదీలోపు భూమిని ఆ స్పేస్ స్టేషన్ ఢీకొనే అవకాశ‌ముంద‌ని శాస్త్రవేత్తలు అంచ‌నా వేస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ 1వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 12.15 నిమిషాల‌కు అది భూమిని ఢీకొంటుంద‌ని యూరోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ (ఈయూఏ)తెలిపింది. ఆ స్పేస్ స్టేషన్ మాల్ ఫంక్ష‌న్ కు గురైన నేప‌థ్య‌లో అది చైనా అధీనంలో కూడా లేదు. దీంతో, దానిని స‌ముద్రంలో ల్యాండ్ అయ్యే విధంగా చేసే అవ‌కాశం కూడా లేదు. దీంతో, స్కూల్ బ‌స్సు సైజులో (8.5టన్నులు) ఉన్న `టియాన్ గాంగ్-1` భూమిపై ఏ ప్రాంతంలో ప‌డుతుందో అన్న అంశంపై ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం టియాన్ గాంగ్ -1.....అమెరికాలోని చికాగో, టాస్మేనియా, మిచిగాన్ ప్రాంతాల‌ను ఢీకొట్టే అవ‌కాశ‌ముంద‌ని ఈయూఏ తెలిపింది. ఈ నేప‌థ్యంలో మిచిగాన్ గవర్నర్ రిక్ సేండర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టియాన్ గాంగ్ -1 భూమిని ఢీకొంటే మిచిగాన్ ప్రాంతానికి ఎలాంటి న‌ష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయ‌న ఆదేశించారు. అయితే, గవర్నర్ ప్రకటనతో ప్ర‌జ‌లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నార‌ని అమెరికా మీడియా తెలిపింది. ఈ నేప‌థ్యంలో భూమిని టియాన్ గాంగ్ ఢీకొట్టకుండా చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలను మీడియా కోరుతోంది. అయితే, ప్ర‌జ‌లు భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌ని, అది భూమిని ఢీకొనే ప్ర‌భావం ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌ద‌ని కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 100 నుంచి 200 కిలోల బ‌రువున్న వ‌స్తువు మాత్ర‌మే భూమికి చేరుతుంద‌ని, దాని ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చని అభిప్రాయ‌ప‌డుతున్నారు.