Begin typing your search above and press return to search.

ఇండియాను ఫుట్ బాల్ ఆడుకుంటున్న పాక్, చైనా

By:  Tupaki Desk   |   9 Jan 2016 6:48 AM GMT
ఇండియాను ఫుట్ బాల్ ఆడుకుంటున్న పాక్, చైనా
X
సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు... అంతర్గతంగా ఉగ్రవాద దాడులతో నానా ఇబ్బందులు పడుతున్న భారత్ కు ఇప్పుడు ఇంకో చిక్కు వచ్చిపడింది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే)లో మెగా డ్యామ్‌ నిర్మించడానికి చైనా కంపెనీ రంగం సిద్ధం చేసుకుంటోంది. వద్దని భారత్‌ ప్రతిఘటిస్తున్నప్పటికీ ఆ కంపెనీ తనపనితాను చేసుకుంటూ పోతోంది. డ్యామ్‌ వివరాల ను తన వెబ్‌ సైట్‌ లో ఉంచింది. చైనా ప్రభుత్వం మద్దతు లేకుండా ఆ కంపెనీ అంత సాహసానికి పూనుకోవడానికి అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు.... పాక్ - చైనాలు కలిసే ఈ పన్నాగం పన్నినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.

చైనా ప్రభుత్వ హైడ్రోపవర్‌ కంపెనీల్లో అతి పెద్దదైన చైనా త్రీ గోర్జెజ్‌ కార్పొరేషన్‌(సీటీజీసీ) పీఓకేలో ఆనకట్ట నిర్మిస్తోంది. ప్రపంచంలోనే భారీ ప్రాజెక్టుగా పేరు గాంచిన 22,500 మెగావాట్ల విద్యుత్పాదన సామర్థ్యం కలిగిన త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ ను యంగ్ట్‌ జె నదిపై నిర్మించిన సంస్థ ఇది. పీఓకేలో కొహలా హైడ్రోపవర్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసినట్టు ఒక ప్రకటనను తన వెబ్‌ సైట్‌ లో ఉంచింది.

పీఓకేలో ముజఫరాబాద్‌ నుంచి దిగువకు ప్రవహించే రీలమ్‌ నదిపై 1,100 మెగావాట్ల డ్యామ్‌ ను నిర్మించనున్నారు. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 2.4 బిలియన్‌ డాలర్లు. దీనికి సంబంధించి చైనా - పాకిస్తాన్‌ దేశాలు 30 ఏళ్ల కాలానికి ఒక ఒప్పందం చేసుకున్నాయంటూ పాక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. పీఓకేలో భారీ ప్రాజెక్టులు చేపట్టడానికి చైనా సుముఖంగా ఉందనే విషయాన్ని తాజా ఒప్పందం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. భారత్‌ అభ్యంతరాలను బేఖాతరు చేస్తోంది. గతంలో దక్షిణ చైనా సముద్రంలో భారత్‌ - వియత్నాం ఉమ్మడిగా చేపట్టిన చమురు వెలికితీత ప్రాజెక్టుల పట్ల చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత్‌ అధికారులు ఈ సందర్భంగా వేలెత్తి చూపుతున్నారు.

పాకిస్థాన్ తో సయోధ్యకు ప్రధాని మోడీ ఎంతగా ప్రయత్నించినా ఇండియాపై ఉగ్రవాద దాడులను పాక్ నియంత్రించడం లేదు. అలాగే చైనా ప్రయోజనాల కోసం వియత్నాంతో ప్రాజెక్టులను ఇండియా మానుకుంటున్నా చైనా మాత్రం పాక్ తో కలిసి ఇండియా అభ్యంతరాలను పట్టించుకోకుండా డ్యామ్ లు కడుతోంది. ఈ నేపథ్యంలో పొరుగుదేశాలు ఇండియాతో ఆడుకుంటున్నాయా అన్న వాదన వినిపిస్తోంది.