Begin typing your search above and press return to search.

చైనా వ‌ర్సెస్ తైవాన్.. ఎవ‌రి బ‌ల‌గ‌మెంత‌?

By:  Tupaki Desk   |   4 Aug 2022 6:42 AM GMT
చైనా వ‌ర్సెస్ తైవాన్.. ఎవ‌రి బ‌ల‌గ‌మెంత‌?
X
అమెరికా దిగువ స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తైవాన్ ప‌ర్య‌ట‌న‌తో చైనా అగ్గి మీద గుగ్గిల‌మ‌వుతోంది. చైనా హెచ్చ‌రిక‌లు, బెదిరింపుల‌ను బేఖాత‌రు చేస్తూ నాన్సీ పెలోసీ తైవాన్ రావ‌డం, వెళ్లిపోవ‌డం జ‌రిగిపోయాయి. దీంతో తైవాన్ పై ముప్పేట దాటికి చైనా సిద్ధ‌మ‌వుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ద్వీప దేశ‌మైన తైవాన్ ను చైనా చుట్టుముట్టింది. తైవాన్ లో అన్ని విమానాశ్ర‌యాలు, నౌకాశ్ర‌యాల‌ను దిగ్భంధం చేసింద‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

అదేవిధంగా తైవాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ వెబ్‌సైట్‌ను చైనా హ్యాక‌ర్లు హ్యాక్ చేశారు. ఇప్ప‌టికే చైనా త‌న అమ్ముల‌పొదిలోకి కీల‌క జె-12 జెట్ ఫైట‌ర్ల‌ను, ఎస్‌యూ-30 యుద్ధ విమానాల‌ను తైవాన్ ర‌క్ష‌ణ గ‌గ‌న‌త‌లంలోకి పంపి త‌న ఉద్దేశాన్ని చాటి చెప్పింద‌ని అంటున్నారు. మొత్తం 27 యుద్ధ విమానాలు తైవాన్ గ‌గ‌న‌తలంలోకి చైనా పంప‌డంతో తైవాన్ సైతం ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. చైనీస్ యుద్ద విమానాల‌ను పార‌దోల‌డానికి జెట్ల‌ను రంగంలో దించింది. ఈ నేప‌థ్యంలో చైనా, తైవాన్ ఇరు దేశాల బ‌ల‌గాల ప‌రిస్థితిని ఒక‌సారి చూద్దాం.

సైన్యం, ఆయుధ సంపత్తి విషయంలో చైనాకు తైవాన్‌ ఏ మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. చైనాకు 20లక్షలకు పైగా యాక్టివ్‌ బలగాలు ఉంటే.. తైవాన్‌కు లక్షా 69వేల మంది మాత్రమే ఉన్నార‌ని తెలుస్తోంది. చైనాకు పదాతి దళం 9.65 లక్షలు ఉంటే.. తైవాన్‌కు 94వేల మంది మాత్రమే ఉన్నార‌ని స‌మాచారం. చైనాకు 2లక్షల 60వేల నేవీ దళం, 3లక్షల 95వేల ఎయిర్‌ఫోర్స్ బలగం ఉంటే.. తైవాన్‌కు నేవీ 40వేలు, ఎయిర్‌ఫోర్స్‌ 35వేల బలగం మాత్రమే ఉంద‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.

చైనాకు 5వేల 4వందల యుద్ధ ట్యాంక్‌లు, 3వేల 227 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 59 సబ్‌మెరైన్‌లు, 9వేల 8వందలకు పైగా ఫిరంగి వాహనాలు ఉంటే.. తైవాన్‌కు 650 యుద్ధ ట్యాంక్‌లు, 504 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 4సబ్‌ మెరైన్‌లు, 2వేల ఫిరంగి వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో యుద్ధం వ‌స్తే తైవాన్.. చైనాను త‌ట్టుకుని నిల‌బ‌డి నెగ్గ‌డం క‌ష్ట‌మే.

అయితే తైవాన్‌కు అండ‌గా అమెరికా, జ‌పాన్, ఆస్ట్రేలియా త‌దిత‌ర దేశాలు నిలిచే అవ‌కాశం ఉంది. ఇవి నేరుగా యుద్ధంలోకి దిగ‌క‌పోయినా తైవాన్ కు కావాల్సిన ఆయుధాల‌ను, క్షిప‌ణుల‌ను, యుద్ధ నౌక‌ల‌ను అందించే వీలు ఉంది. ప్ర‌స్తుతం ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఆయా దేశాలు ఉక్రెయిన్ కు అండ‌గా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా తైవాన్‌కు చైనా బలగాలు చేరుకోవాలంటే.. దాదాపు 128 కిలోమీటర్ల ఇరుకైన తైవాన్ జలసంధిని దాటాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. అమెరికా అండ‌దండ‌లు అందిస్తే ఇలా వ‌చ్చే చైనా బలగాలను టార్గెట్ చేయడం తైవాన్ కు పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని అంటున్నారు.