Begin typing your search above and press return to search.

భారత్ లో పెట్టుబడి పెట్టొద్దు.. తమ కంపెనీలకు చైనా ఆదేశం

By:  Tupaki Desk   |   19 Jun 2020 8:17 AM GMT
భారత్ లో పెట్టుబడి పెట్టొద్దు.. తమ కంపెనీలకు చైనా ఆదేశం
X
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలో ఇరు దేశాల సైనికుల మరణించడంతో ఒక్కసారిగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. చైనా వస్తువులు, యాప్స్ ను భారతీయులు నిషేధిస్తున్నారు. ఈ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. భారత్ లో చైనాకు వ్యతిరేకంగా వాతావరణం ఇప్పట్లో తగ్గేట్టు లేదు. ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా చైనా వస్తువులు నిషేధించాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలోనే చైనా దేశం తమ కంపెనీలకు సందేశాలు పంపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మెరుగుపడే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని.. భారత్ లో పనిచేస్తున్న చైనా అన్ని సంస్థలకు సందేశాలు పంపింది. ఈ సంక్షోభం పరిష్కరించబడే వరకు భారతదేశంలో పెట్టుబడులు, ఉత్పత్తిని ఆపేయాలని తమ కంపెనీలను చైనా తాజాగా కోరింది.

చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఈ మేరకు ఒక కథనం ప్రచురించింది. భారత్ లో పనిచేస్తున్న చైనా కంపెనీలు పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని సూచించింది. చైనాకు వ్యతిరేకంగా భారత్ లో ఆర్థిక, వాణిజ్య సంబంధాలు క్షీణిస్తున్నాయని.. సరిహద్దు వివాదం తగ్గేలా లేదని.. చైనాకు వ్యతిరేకంగా భారత్ లో వాతావరణం ఉందని.. దీంతో వెంటనే పెట్టుబడులు, ఉత్పత్తిని ఆపేస్తే మంచిదని చైనా తమ సంస్థలకు సూచించింది.

20 మంది భారత సైనికుల మరణంతో చైనాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దేశంలో చైనా వస్తువులను తగులబెడుతున్నారు. వాడడం మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా కూడా తమ దేశ కంపెనీలను విత్ డ్రా కావాలని సూచించింది.