Begin typing your search above and press return to search.

ఒక్కరోజులో ఒక్కడి లాస్ రూ.23,760కోట్లు

By:  Tupaki Desk   |   26 Aug 2015 7:20 AM GMT
ఒక్కరోజులో ఒక్కడి లాస్ రూ.23,760కోట్లు
X
జేబులో పెట్టుకున్న వెయ్యి రూపాయిల నోటు కనిపించకపోతే కిందామీదా పడిపోతుంటాం. ఇక.. అలాంటిది పదివేల రూపాయిల పోగొట్టుకుంటే ఆ బాధ అంతా ఇంతా కాదు. మనమంటే సామన్యులం కాబట్టి ఆ మొత్తమే భారీగా కనిపించి.. మన నుంచి చేజారిన డబ్బు గురించి అదే పనిగా ఫీల్ అవుతుంటాం. మరి.. వ్యాపారం చేసే వ్యాపారి తన వ్యాపారంలో నష్టపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు.

మరి.. బాగా డబ్బు మదించి ఉన్న ఒక ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఒక్క రోజులో ఎంత లాస్ కాగలడు? వందకోట్లా? రెండు వందల కోట్లా? లేదంటే వెయ్యి కోట్లా? కాదంటే పదివేల కోట్లా? ఈ అంకెల గురించి వింటేనే గొంతు తడారిపోవటం ఖాయం. ఇక.. ఆ వ్యక్తికి సంబంధించి వాస్తవ నష్టం గురించి వింటేనే మన చిట్టి గుండె చిక్కబడుతుంది. అంకెల మీద సందేహాలు కలిగించి.. అసలీ వార్త నిజమా అన్న డౌట్ వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు.

సోమవారం నాటి ‘షాక్ మార్కెట్’’ దెబ్బకు షేర్ల మీద పెట్టిన డబ్బులు కళ్ల ముందే ఆవిరి కావటం తెలిసిందే. ఇండియాతో సహా పలు.. ఆసియా.. అమెరికా.. యూరప్ దేశాల్ని దారుణంగా నష్టపోయేలా చేసిన చైనా ఆర్థిక ఒడిదుడుకుల గురించి తెలిసిందే. అయితే.. ఈ మహా పతనంలో చైనాకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దారుణంగా నష్టపోయాడు. ఎంత దారుణంగా అంటే.. ఆయన దగ్గర ఉన్న షేర్ల విలువ భారీగా పడిపోవటంతో ఆయన ఆస్తి సోమవారం ఒక్క రోజు వ్యవధిలో ఏకంగా 3.6 బిలియన్ డాలర్లు లాస్ అయ్యాడు.

ఒక బిలియన్ అంటే (1000కోట్లు) చొప్పున 3.6 బిలియన్ డాలర్లు (ఒక్కో డాలరును మన రూపాయిల్లో లెక్కేస్తే రూ.66 చొప్పున) వచ్చే నష్టం అక్షరాల రూ.23,760కోట్లుగా తేలుతుంది. చైనాలోని ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన డాలియన్ వండర్ కంపెనీ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్ లిన్ ఇంత భారీ మొత్తాన్ని నష్టపోయాడు. అనుకుంటాం కానీ.. బాగా డబ్బులున్నా ఎంత ప్రమాదం? మనలాంటి సామాన్యులు డబ్బును నిర్లక్ష్యంగా చేజార్చుకుంటారు. కానీ.. వాంగ్ లాంటి పారిశ్రామివేత్తలు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కాలం.. ఖర్మం కలిసి రాకపోతే.. స్టాక్ మార్కెట్ పతనమైతే.. వేలాది కోట్ల రూపాయిలు కొన్ని గంటల్లోనే గాల్లో కలిసిపోతాయి. ఒక వ్యక్తికి ఇంత భారీ నష్టమంటే.. వామ్మో ఆలోచిస్తేనే తల తిరిగిపోవటం ఖాయం.