Begin typing your search above and press return to search.

మళ్లీ ‘బరి’తెగించిన డ్రాగన్

By:  Tupaki Desk   |   1 Aug 2017 5:17 AM GMT
మళ్లీ ‘బరి’తెగించిన డ్రాగన్
X
డ్రాగ‌న్ మ‌ళ్లీ బ‌రితెగించింది. భారత్ భూభాగంలోకి చైనా మళ్లీ చొచ్చుకొచ్చింది. విస్తరణ దాహంతో పేట్రేగిపోతున్న డ్రాగన్లు ఈసారి ఉత్తరాఖండ్‌ లోని బారాహోటి సరిహద్దులో కిలోమీటరు మేరకు లోపలికి చొచ్చుకు వచ్చింది. అక్కడ గొర్రెలు - పశువులను మేపుతున్న కాపరులను ఆ ప్రాంతం నుంచి వెళ్లిపొమ్మని బెదిరించింది. సిక్కిం సరిహద్దులోని డోక్లామ్‌ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆగడాలకు భారత్ సైనికులు అడ్డుకట్ట వేయడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న డ్రాగన్లు ఇప్పుడు కొత్తగా ఉత్తరాఖండ్‌ లోని చమోలి జిల్లా సరిహద్దులోని బారాహోటి ప్రాంతంలోని చొచ్చుకు వచ్చింది.

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌ కు 140 కిలోమీటర్ల దూరంలోని బారాహోటి ఉంది. ఈ ప్రాంతంలో ఏ దేశ సైన్యం కూడా తిరగకూడదన్న (డీ మిలిటరైజ్డ్ జోన్) ఒప్పందం ఉంది. 1958లో బారాహోటిని వివాదాస్పద ప్రాంతంగా భారత్ - చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక్కడ ఈ రెండు దేశాలు తమ సైన్యాన్ని గస్తీకి పంపకూడదన్న ఒప్పందం కూడా ఉంది. దీంతో ఇక్కడ కేవలం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటిబిపి) మాత్రం సివిల్ డ్రెస్‌ లో గస్తీ తిరుగుతారు. బారాహోటి పోస్ట్‌ లో ఐటిబిపి మాత్రమే అదీ ఆయుధాలు లేకుండా గస్తీ తిరిగేలా 2000 సంవత్సరంలో భారత్ ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించి బారాహోటిలోకి అక్రమంగా ప్రవేశించింది. చైనా ఆర్మీ బారాహోటి ప్రాంతంలోకి ఈ నెల 25న చొచ్చుకు వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి వెల్లడించిన‌ట్లు స‌మాచారం.