Begin typing your search above and press return to search.

సరిహద్దుల్లో 40వేల మంది చైనా సైనికులు

By:  Tupaki Desk   |   23 July 2020 10:10 AM GMT
సరిహద్దుల్లో 40వేల మంది చైనా సైనికులు
X
భారత సరిహద్దుల్లో చైనా కుయుక్తులు పన్నుతోంది. ఉపసంహరణకు సరేనంటూ చైనా భారీగా ఆ దేశ సైనికులను సరిహద్దుల్లో మోహరిస్తోంది. తూర్పు లఢక్ సెక్టార్ లో భారత్-చైనా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి మళ్లిస్తున్నామని పైకి చెబుతున్న చైనా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బలగాల మళ్లింపుపై ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లెక్కచేయడం లేదు.

తాజాగా అక్కడ దాదాపు 40000 మంది చైనా సైనికులు తిష్టవేసినట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని సైతం కలిగి ఉన్నట్లు తెలియజేసింది. భారత్-చైనా కమాండర్ల స్థాయి చర్చలు గత వారంలోనే జరిగాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. అయినా చైనా సరిహద్దుల్లో దుందుడుకుగా వ్యవహరిస్తూనే ఉంది.

చైనా సైన్యం కదలికలతో భారత్ కూడా ధీటైన రీతిలో మరిన్ని బలగాలను.. యుద్ధ సామగ్రిని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని శాంతియుత ప్రాంతాల నుంచి రిజర్వ్ బలగాలను పంపిస్తోంది.

చైనాతో మళ్లీ ఉద్రికత్త నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని భారత వాయుసేన (ఐఏఎఫ్)కు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశించారు.ఇటీవల వైమానిక దళం వేగంగా మోహరించడాన్ని ఆయన ప్రశంసించారు. మన బలగాళ యుద్ధ సన్నద్థత కారణంగానే శత్రువులకు బలమైన సందేశం వెళ్లినట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు.