Begin typing your search above and press return to search.

గాల్వన్ వ్యాలీలో వెనక్కి వెళ్లిన చైనా సైన్యం !

By:  Tupaki Desk   |   25 Jun 2020 1:30 PM GMT
గాల్వన్ వ్యాలీలో వెనక్కి వెళ్లిన చైనా సైన్యం !
X
ఇండియా, చైనా సరిహద్దులో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యాలు ఘర్షణకు దిగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. అయితే , భారత-చైనా దళాల మధ్య భీకర ఘర్షణ జరిగిన గాల్వన్ లోయలో మెల్లగా ప్రశాంతత ఏర్పడనుందా , పరిస్థితి చల్లబడనుందా ? ఆ ప్రాంతంలో చైనా సైనికులు తమ మిలిటరీ వాహనాలతో బాటు కొంతమేర వెనక్కి వెళ్లినట్టు సమాచారం.

దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈ ఉపసంహరణ జరిగినట్టు సైనిక వర్గాలు సూత్రప్రాయంగా తెలిపాయి. ఉభయ దేశాల మధ్య ఉన్నత స్థాయి దౌత్య, సైనికపరమైన చర్చలు వరుసగా జరిగిన నేపథ్యంలో చైనా సైనికులు కొంత వెనక్కి మళ్లినట్టు భావిస్తున్నారు. డీ-ఎస్కలేషన్ పై ఈ నెల 6 న, మళ్ళీ 17 న, తిరిగి 22 న రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే సేనలు వెనక్కి మళ్లడమన్నది ఒక్క గాల్వన్ లోయకే పరిమితమైంది.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అలాగే , భారత-చైనా మధ్య ఉద్రిక్తతకు చల్లారే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యపై విభేదాల పరిష్కారానికి ఉభయ దేశాల నాయకులూ ఏకాభిప్రాయానికి వచ్చారని, దీనికి కట్టుబడి ఉండాలని, బోర్డర్ ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని వారు నిర్ణయించినట్టు సీనియర్ దౌత్యాధికారులు తెలిపారు.చైనా విదేశాంగ శాఖలో డిపార్ట్ మెంట్ ఆఫ్ బౌండరీ అండ్ ఓషనిక్ అఫైర్స్ శాఖ లోని డైరెక్టర్ జనరల్ హాంగ్ లియాంగ్, భారత విదేశాంగ శాఖలోని సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాత్సవ మధ్య చర్చలు జరిగాయి. భారత-చైనా సరిహద్దు సమస్యపై కూలంకషంగా వీరు చర్చించారని, ఈ నెల 17 న ఉభయ దేశాల విదేశాంగ మంత్రులూ ఫోన్ ద్వారా జరిపిన సంప్రదింపుల్లో వఛ్చిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవాలని వీరు తీర్మానించారు.