Begin typing your search above and press return to search.

చైనా జెండాలు కశ్మీర్ వ్యాలీలోకి రావటమంటే..

By:  Tupaki Desk   |   15 Oct 2016 6:02 AM GMT
చైనా జెండాలు కశ్మీర్ వ్యాలీలోకి రావటమంటే..
X
ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా కశ్మీర్ వ్యాలీలో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. భారత్ నుంచి విడిపోయి బతికేయాలంటూ కొందరు దురాశాపరులైన కశ్మీరీలు కలకలాన్ని రేపటం కొత్తేం కాదు. దాయాది పాకిస్థాన్ అండ చూసుకొని రెచ్చిపోయే ఇలాంటి వారు ఎప్పుడూ లేని తీరులో సరికొత్తగా వ్యవహరించారు. కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగరటం మామూలే. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా చైనా జెండాలు ఎగిరి కొత్త ఉద్రిక్తతలకు తెర తీసింది.

హిజ్బుల్ తీవ్రవాది బుర్హాన్ వని మరణం తర్వాత కశ్మీరీ లోయలో ఆందోళనలు చెలరేగటం.. నెలల గడుస్తున్నా.. పరిస్థితుల్లో మార్పు రాకపోవటం తెలిసిందే. వని ఎన్ కౌంటర్ కు నిరసనగా ఆందోళకారులు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించటం.. వాటిని కట్టుదిట్టం చేసే ప్రయత్నంలో భద్రతా దళాలు కరకుగా వ్యవహరించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనాకారులు.. భద్రతా బలగాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్న పరిస్థితి.

రాళ్ల దాడులతో భద్రతా దళాల్ని తీవ్రంగా గాయపరిచే ఆందోళనకారుల్ని నిలువరించే క్రమంలో జరిపే భాష్పవాయువు.. లాఠీచార్జ్ ల కారణంగా కొందరు మరణించటం.. దీనిపై మళ్లీ అగ్గి రాజుకొని ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకోవటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఇలా నిరసనలతో అట్టుడికిపోతున్న కశ్మీర్ ను ప్రశాంతంగా మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలుఒక కొలిక్కిరావటం లేదు.

ఇదిలా ఉండగా.. తొలిసారి కశ్మీర్ వ్యాలీలో చైనా జెండాలు ఎగరటం గమనార్హం. ఆందోళనల్నిచేపట్టే ఆందోళనకారులు పాక్ జెండాల్ని మాత్రమే ప్రదర్శించే వారు. తాజాగామాత్రం పాక్ జెండాలతో పాటు చైనా జెండాల్ని ప్రదర్శించటం ద్వారా.. కశ్మీర్ ఇష్యూలో చైనా మద్దుతు కోరుతున్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. బారాముల్లా ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముఖాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నకొందరు యువకులు పాక్ జెండాలతో పాటు చైనా జెండాల్ని ప్రదర్శించటం ద్వారా.. కశ్మీర్ విషయంలో డ్రాగన్ తలదూర్చాలన్న సందేశాన్ని ఇచ్చినట్లైంది. పాక్ ప్రాంతమైన బలూచిస్థాన్ లో అక్కడి వారు పాక్ మీద ఉన్న వ్యతిరేకతతో భారత్ జెండాలు ఎగురవేస్తున్న వేళ.. కశ్మీర్ లో చైనా జెండాలు ఎగరటం చూస్తే.. దీని వెనుక దాయాది హస్తం ఉందన్న భావన కలగటం ఖాయం. కశ్మీర్ విషయంలో కేంద్రం అట్టే ఆలస్యం చేయకుండా కఠినంగా వ్యవహరించి.. అటు పాక్ కు.. ఇటు కశ్మీర్ లోని వేర్పాటువాదులకు చెక్ చెప్పాల్సిన అవసరాన్ని తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/