Begin typing your search above and press return to search.

ల‌ద్దాఖ్ లో చైనా జాతీయ జెండాల‌ ప్ర‌ద‌ర్శ‌న‌.. కార‌ణం ఇదే!

By:  Tupaki Desk   |   12 July 2021 3:30 PM GMT
ల‌ద్దాఖ్ లో చైనా జాతీయ జెండాల‌ ప్ర‌ద‌ర్శ‌న‌.. కార‌ణం ఇదే!
X
చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన‌ ల‌ద్దాఖ్ లోని డెమ్ చుక్ ప్రాంతంలో కొంద‌రు చైనా సైనికులు, పౌరులు ఆ దేశ జెండాల‌ను ప్ర‌దర్శించారు. సింధు న‌ది అవ‌త‌లి వైపున వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా జాతీయ ప‌తాకంతోపాటు ప‌లు బ్యాన‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శించారు. టిబెట్ ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా పుట్టిన రోజు వేడుక‌ల‌ను భార‌త్ లో జరుపుకోవ‌డ‌మే వారి నిర‌స‌న‌కు కార‌ణ‌మైంది.

ద‌లైలామా పుట్టిన రోజు వేడుక‌ల‌ను భార‌తీయులు జ‌రుపుకోవ‌డం ప‌ట్ల వారు నిర‌స‌న తెలిపారు. ఈ నెల 6వ తేదీన‌ సింధు న‌ది వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. మొత్తం ఐదు వాహ‌నాల్లో వ‌చ్చిన చైనా సైనికులు, పౌరులు డెమ్ చుక్ గ్రామంలోని క‌మ్యూనిటీ సెంట‌ర్ వ‌ద్ద నిర‌స‌న తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై డెమ్ చుక్ సెక్టార్ లోని చివ‌రి స్థావ‌రాల్లో ఒక‌టైన కోయుల్ అధిప‌తి తెస్వాంగ్ మాట్లాడుతూ.. డ్రాగ‌న్ ఆర్మీ సిబ్బంది, చైనా పౌరులు క‌లిసి ఐదు వాహ‌నాల్లో వ‌చ్చారని తెలిపారు. క‌మ్యూనిటీ సెంట‌ర్ నుంచి దాదాపు 200 మీట‌ర్ల దూరంలో బ్యాన‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్టు చెప్పారు. 6వ తేదీన ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలిపారు.

కాగా.. టిబెట్ త‌మ అంత‌ర్భాగ‌మ‌ని చైనా ఎప్ప‌టి నుంచో వాదిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ.. ద‌లైలామాతోపాటు టిబెట్ల‌ను దానికి అంగీక‌రించ‌ట్లేదు. చైనా ఆధిప‌త్యాన్ని అంగీక‌రించ‌బోమ‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. చైనా అది త‌మ‌దేనని చెబుతోంది. భార‌త్ మాత్రం టిబెట్ కు మ‌ద్ద‌తు ప‌లుకుతోంది. ఈ క్ర‌మంలో.. ఇండియాలో ద‌లైలామా పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకోవ‌డంతో చైనా ఇలా బ్యాన‌ర్ల‌తో ఆక్రోశం వెళ్ల‌గ‌క్కింది. ద‌లైలామాకు ప్ర‌ధాని మోడీ కూడా బ‌ర్త్ డే విషెస్ చెప్పారు.