Begin typing your search above and press return to search.

ఫ్రీగా ఇల్లు ఇస్తారని 23 పెళ్లిళ్లు చేసుకున్న ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   26 Sep 2019 5:12 AM GMT
ఫ్రీగా ఇల్లు ఇస్తారని 23 పెళ్లిళ్లు చేసుకున్న ఫ్యామిలీ
X
ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలిపెట్టరంటూ చతురంగా అనుకునే మాటకు బెస్ట్ ఎగ్జాంఫుల్ అన్న తరహాలో ఒక ఫ్యామిలీ చేసిన పని ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సదరు ఫ్యామిలీ కక్కుర్తి ప్లాన్ విన్నోళ్లంతా నోరు వెళ్లబెడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాన్ని భారీగా సొంతం చేసుకునేందుకు వారు వేసిన ఎత్తుగడకు అవాక్కు అవుతున్నారు అధికారులు. అయితే.. అత్యాశకు పోతే ఎప్పుడేం జరుగుతుందో.. తాజా ఉదంతంలోనూ చివరకు అదే జరిగింది.

చైనాలోని జెంజియాంగ్ ఫ్రావిన్స్ లో ఒక గ్రామం ఉంది. అక్కడ డెవలప్ మెంట్ యాక్టివిటీలో భాగంగా ప్రభుత్వం అక్కడున్న ఇళ్లను కూల్చేసింది. అదేసమయంలో పరిహారం కింద ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉచితంగా కొత్తింటిని కట్టి ఇస్తామన్న ప్రకటన చేసింది.

దీంతో.. ప్రభుత్వ ప్రకటనను తమకు అనుకూలంగా మార్చుకొని భారీ ఎత్తున ఇళ్లు సంపాదించాలని భారీ ప్లాన్ వేసిందో కుటుంబం. ఇందులో భాగంగా కుటుంబంలో కీలకమైన ప్యాన్ అనే వ్యక్తి తన మాజీ భార్యను మళ్లీ చేసుకున్నాడు. దీంతో.. ఆమెకు గ్రామంలో నివసించే వ్యక్తిగా గుర్తింపు పొందటంతో పాటు.. ఆ ఆధారంగా ఆమెకు ఒక ఇంటిని కేటాయించే అవకాశం లభించింది. ఆ తర్వాత ప్యాన్ ఆమెకు మళ్లీ విడాకులు ఇచ్చేశారు. మరో పెళ్లి చేసుకున్నారు.

ఇలా ప్యాన్ కుటుంబంలోని సభ్యులంతా ఇదే ప్లాన్ ను ఏ మాత్రం తేడా లేకుండా చేసేశారు. ఇలా మొత్తం 23 సార్లు ప్యాన్ ఫ్యామిలీ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చేశారు. అయితే.. వ్యవస్థలు మన దగ్గర మాదిరిగా ఉంటే అది చైనా ఎందుకు అవుతుంది? ఈ దరిద్రపుగొట్టు ప్లాన్ ను మొదట్లోనే గుర్తించేసిన అక్కడి అధికారులు మొత్తం ఫ్యామిలీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ధర్మంగా ఉంటే వచ్చే ఇంటిని వదులకొని.. అత్యాశకు పోయి భారీగా ఇళ్లు కొట్టేయాలన్న ఆలోచన ఇప్పుడు వారందరికి జైలుపాలు చేసింది. స్థానికంగానే కాదు.. దేశ వ్యాప్తంగా ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.