Begin typing your search above and press return to search.

భార‌త్ సేఫ్‌ గురించి చైనా చిల‌క‌ప‌లుకులు

By:  Tupaki Desk   |   18 Sep 2017 11:40 AM GMT
భార‌త్ సేఫ్‌ గురించి చైనా చిల‌క‌ప‌లుకులు
X
భార‌త్‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన చైనా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరిన చైనా.. డొక్లాం ఉదంతంలో స‌వాళ్లు రువ్విన చైనా.. ఇప్పుడు ఉన్న‌ట్టుండి భార‌త్‌ పై ప్రేమ ఒల‌క‌బోస్తోంది. భార‌త్ మంచికోస‌మే.. అంటూ.. క‌ప‌ట ఆలోచ‌న‌లను రంగ‌రించిన‌ చిల‌క‌ప‌లుకులు ప‌లుకుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ శాంతి - భ‌ద్ర‌త విష‌యాల్లో అమెరికా - జ‌పాన్‌ ల‌తో భార‌త్ బ‌ల‌మైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంటోంది. ఇది చైనాకు మింగుడు ప‌డ‌డం లేదు. ఈ మూడు దేశాలు ఇలా ముడి వేసుకుంటే.. భ‌విష్య‌త్తులో త‌న ఎత్తులు పార‌వ‌ని - భార‌త్‌ పై కాలు దువ్వేందుకు ఛాన్స్ ఉండ‌ద‌ని భావించిందో ఏమో.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని మీ మంచికోస‌మే అంటూ.. భార‌త్‌ కు సూచ‌న‌లు చేసింది.

అమెరికాతో కలిసి జపాన్‌.. భారత్‌ ను తప్పుదోవ పట్టిస్తోందని చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ఓ క‌థ‌నాన్ని వండి వార్చింది. ఆ రెండు దేశాలు చెప్పింది వింటూ భారత్ త‌మ‌ ది బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఫోరం సదస్సుకు రాలేద‌ని, ఇది మంచి ప‌రిణామం కాద‌ని నిష్టూరం వ్య‌క్తం చేసింది. మ‌రోవైపు అమెరికా - జపాన్‌ ప్రతినిధులు మాత్రం ఈ స‌ద‌స్సులో పాల్గొన్నార‌ని ఈ ప‌త్రిక వివ‌రించింది. అంతేకాదు - అమెరికాను జపాన్‌ నేరుగా ఎదుర్కోలేక‌ భారత్‌ ను ఓ పావులా వాడుకుంటోందని లేని విష‌యాల‌ను త‌వ్వి తీసింది. అభూత క‌ల్ప‌న‌ల‌ను తెర‌మీద‌కి తెచ్చింది.

భార‌త్‌లో జ‌పాన్ ప్రధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఇరు దేశాల ప్ర‌ధానులు ప్ర‌క‌టించిన ఆసియా-ఆఫ్రికా గ్రోత్‌ కారిడార్‌ కాన్సెప్ట్ త‌మ దేశానికి చెందిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుకు కాపీ అని చైనా మీడియా ఆరోప‌ణ‌లు చేసింది. ఇండియాలోని ర‌హ‌దారులను చైనా మురికికూపాల‌తో పోల్చింది. భార‌త్‌లో జ‌పాన్ సాయంతో ఎన్ని ప్రాజెక్టులు చేప‌ట్టి ఏం లాభ‌మ‌ని వాపోయింది. జపాన్‌, భారత్‌లు ఆయా దేశాల అవసరాల ఆధారంగా స‌త్సంబంధాలు కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చింది. మొత్తానికి ఈ ప‌రిణామం ఇప్పుడు చైనా నీచ బుద్ధిని బ‌ట్ట‌బ‌య‌లు చేసింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అమెరికా-జ‌పాన్‌-భార‌త్ స్నేహాన్ని ఓర్చుకోలేకే చైనా ఇలా వ్యాఖ్యానాలు, విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని వారు చెబుతున్నారు. ఇది నిజ‌మే క‌దా!?