Begin typing your search above and press return to search.

చైనా మాటలు ఒకలా.. చేష్టలు మరోలా..

By:  Tupaki Desk   |   30 Aug 2020 10:30 AM GMT
చైనా మాటలు ఒకలా.. చేష్టలు మరోలా..
X
చైనా మాటలు ఒకలా చెబుతూ చేష్టలు మరోలా చేస్తోంది. పైకి శాంతి శాంతి అంటూనే సరిహద్దు వద్ద ఆర్మీ స్థావరాలను నిర్మిస్తూ కపట నాటకాలాడుతోంది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న వివాదాలకు పరిష్కారం దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో చైనా మరోసారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. ఇప్పటికే ఎల్ ఏసీ వెంట 5జీ నెట్వర్క్ ఏర్పాటు ప్రయత్నాలతో పాటు ప్యాంగ్ యాంగ్ సరస్సు వద్ద కొత్తగా నిర్మాణాలు చేపట్టింది. చైనా అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై శాటిలైట్ ఫోటోలు బయటకు వచ్చాయి. డోక్లాం నకులా , సిక్కిం సెక్టార్ల వద్ద చైనా కొత్తగా రెండు ఆర్మీ స్థావరాలు నిర్మిస్తోంది. డోక్లామ్ పీఠభూమిలో భారత్-చైనా -భూటాన్ ట్రై జంక్షన్ లో ఆర్మీ కార్యకలాపాలకు వీలుగా ఈ కొత్త నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. మూడేళ్ల కిందట భారత్-చైనా మధ్య ఘర్షణ జరిగిన సమస్యాత్మక ప్రాంతాలకు దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆర్మీ స్థావరాలను నిర్మిస్తోంది. భారత్ పై లక్ష్యాలను పక్కగా ఛేదించేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధునాతన క్షిపణులను ప్రయోగించేందుకు వీలుగా స్థావరాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. 1962లో చైనా -భారత యుద్ధం తర్వాత.. అంతటి ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ ఎప్పుడూ తలెత్తలేదు. కొద్దిరోజుల కిందట సరిహద్దులో గాల్వన్ లోయలో చైనా జవాన్లు... 20 మందికి పైగా భారత సైనికులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. చైనా చర్యతో ప్రస్తుతం 45 ఏళ్ల కిందటి ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ నెలకొన్నాయి. పైకేమో చైనా గాల్వన్ లోయలో జరిగిన సంఘటన దురదృష్టకరమని అలా జరిగి ఉండకూడదని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న దౌత్య పరమైన చర్చలకు ఈ ఘటన వల్ల అగాథం పెరగకుంటే చాలని చెబుతూనే మరోవైపు సరిహద్దుల్లో ఆర్మీ బేస్ క్యాంపులను నిర్మిస్తూ తన వక్ర బుద్ధి ఎలాంటిదో చైనా చాటింది.