Begin typing your search above and press return to search.

ఆదివాసీల‌కు మేం వ్య‌తిరేకం కాదు.. చిన‌జీయ‌ర్ వివ‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   18 March 2022 4:30 PM GMT
ఆదివాసీల‌కు మేం వ్య‌తిరేకం కాదు.. చిన‌జీయ‌ర్ వివ‌ర‌ణ‌
X
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన వ్యాఖ్యలపై త్రిదండి చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. లక్ష్మీ దేవి పుట్టినరోజు సందర్భంగా ఏపీలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లిన చినజీయర్ స్వామి.. ఈ వివాదంపై స్పందించారు. సమ్మక్క- సారక్క జాతర గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వివాదంపై స్పందించిన చినజీయర్ స్వామి.. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు.

తాము ఆదివాసీలను ఎప్పుడూ.. ఎవరినీ.. ఏమీ అనలేదని అన్నారు. ఆదివాసీ దేవతల పేరు చేప్పుకుని జరుగుతున్న అసాం ఘిక‌ కార్యక్రమాల గురించి వివరించే సందర్భంలో 20 ఏళ్ల క్రితం చెప్పిన మాటలని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పూర్వాపరాలు చూస్తే ఆ విషయం అవగతమవుతుందని సూచించారు.

అయినా.. 20 ఏళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదికి రావటానికి కారణం ఏంటనేది ఆలోచించాల్సిన విషయమని చెప్పారు. తాను ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశానో.. దాని పూర్వాపరాలు చూడకుండా కేవలం కొన్ని మాటలనే ప్రచారంలోకి తీసుకువచ్చారని వివరించారు.

దేశంమంతా సమతామూర్తిస్థాపన గురించి మాట్లాడుకుంటున్న వేళ.. అది సహించని కొందరు తమపై విషప్రచారం చేయాలని చేసిన చర్యగా భావిస్తామన్నారు. మహిళలు, ఆదివాసీలను వెలుగులోకి తీసుకురావాలన్న భావన నుంచి వచ్చిన తాము... వారిని అవమాన పరిచేలా ఎప్పుడూ మాట్లాడమని స్పష్టం చేశారు.

ఆదివాసుల సంక్షేమం కోసం వికాస తరంగిణి ద్వారా అనేక సేవలు అందించినట్టు చినజీయర్ స్వామి తెలిపారు. ప్రజలను ప్రభావితం చేసేటువంటి దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించమన్నారు. ఆ పేరుతో అరాచకాలను సృష్టించే వాళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.

పనిగ‌ట్టుకొని పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారని స్వామి అసహనం వ్యక్తం చేశారు. నిజంగా సామాజిక హితం కోరే వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. విషయం తెలుసుకోవాలని.. ఆ తర్వాత సరైన విధానంలో స్పందించాలని హితవు పలికారు.

పబ్లిసిటీ కోరుకునే విధంగా చేసే ఇలాంటి అల్ప ప్రచార కార్యక్రమాల్లో ఎలాంటి సామాజిక హితం ఉండదన్నారు. సమాజం, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా అందులో తాము ఉంటామని.. అలాంటి వాళ్లను కలిసేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామన్నారు. సమాజం అనే పెద్ద వేదిక మీద పనిచేసే సమయంలో అందరూ కలిసి పనిచేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరమని వివరించారు.