Begin typing your search above and press return to search.

సాములోరికి కేసీఆర్ సావాసం బానే పట్టిందండోయ్

By:  Tupaki Desk   |   17 Jun 2016 7:42 AM GMT
సాములోరికి కేసీఆర్ సావాసం బానే పట్టిందండోయ్
X
ఆర్నెల్ల సావాసం కుదిరితే వాళ్లు వీళ్లు అవుతారంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. అధ్యాత్మికవేత్త.. ప్రఖ్యాత వైష్ణమ స్వాములోరిగా సుప్రసిద్ధులైన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తాజా సంకల్పం విన్న వెంటనే విస్మయం కలగక మానదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అయనెంత సన్నిహితమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రియ శిష్యుల్లో ఒకరైన కేసీఆర్ అలవాట్లు చాలానే చినజీయర్ స్వామివారి మీద పడినట్లుగా ఆయన తాజా వ్యాఖ్యల్ని చూస్తే అర్థమవుతుంది.

ఒక ప్రముఖ దినపత్రికకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సహజంగా ఒక స్వాములోరి ఇంటర్వ్యూను తెలుగు అగ్ర దిన పత్రిక బ్యానర్ వార్తగా ప్రచురించటమే ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే.. ఆ వార్త మొత్తం చదివినప్పుడు అంత ప్రాధాన్యత ఎందుకిచ్చారో ఇట్టే అర్థమవుతుంది. ఒక స్వాములోరి తానో అధ్యాత్మిక ప్రాజెక్టును చేపట్టానని.. దాని కోసం అక్షరాల వెయ్యి కోట్లు ఖర్చు పెట్టనున్నట్లుగా ప్రకటించటం విస్మయాన్ని రేకెత్తించక మానదు. అంత భారీ మొత్తం ఆయన ఎలా సేకరిస్తారు? సమీకరిస్తారంటే.. దేశవిదేశాల్లో ఉన్న భక్తుల కానుకల ద్వారా అంటూ ఆయన చెప్పిన మాటల్ని వింటే.. వావ్ అనిపించక మానదు. భారీ కలల్ని ఆవిష్కరించే కేసీఆర్ తరహాలోనే ఆయనకు గురువైన స్వాములోరు కూడా అంతే భారీగా తన కలను ఆవిష్కరించటమే కాదు.. దానికి సంబంధించిన ఊహాచిత్రాల్ని కూడా విడుదల చేశారు.

ఇంతకీ ఈ ప్రాజెక్టు ఏమిటి? వెయ్యి కోట్ల ఖర్చు ఎందుకన్న విషయాన్ని చూస్తే..

ఏమిటీ ప్రాజెక్ట్?

-సమాజంలోని అన్ని వర్గాల వారిని ఏకం చేసిన మహనీయుడైన రామానుజాచార్యులు జన్మించి 2017 నాటికి వెయ్యేళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ప్రవచనాల్ని ప్రపంచానికి పున: పరిచయం చేయటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ప్రాజెక్టులో భాగంగా ఏం చేస్తారు..?

-హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద చినజీయర్ స్వామి ఆశ్రమంలోని 45 ఎకరాల విస్తీర్ణణంలో ఈ ప్రాజెక్టును చేపడతారు. మూడు దశల్లో సాగే ఈ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం.

మొదటిదశలో.. రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 216 అడుగుల ఎత్తున రామానుజుల పంచలోహ విగ్రహాన్ని 2017లో ఏర్పాటు చేస్తారు. విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం 230 అడుగుల ఎత్తు వరకూ అనుమతి ఇచ్చినా.. దాన్ని 216 అడుగులకే పరిమితం చేయనున్నారు. రామానుజాచార్యులు 120 సంవత్సరాలు జీవించిన దానికి గుర్తుగా 120 కేజీల బరువైన స్వర్ణమూర్తిని ఏర్పాటు చేస్తారు. దానికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తుంటారు.

రెండో దశలో.. సమతామూర్తి చుట్టూ 108 దివ్య దిశామ్స్ పేరిట ఆలయాల నిర్మాణం చేస్తారు. మూడో దశలో.. వేద వాంగ్మయం పేరిట పూర్తి స్థాయి డిజిటలైజ్డ్ గడై ను రూపొందిస్తారు.

ఈ భారీ విగ్రహాన్ని ఎక్కడ తయారు చేస్తారు.. ఖర్చు ఎంత?

-216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని తయారు చేయటానికే దాదాపు రూ.100 కోట్ల వరకూ ఖర్చు అవుతుందన్నది అంచనా. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని చైనాలోని నాన్జింగ్ లో తయారు చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రముఖ విగ్రహాలను తయారు చేసిన సంస్థకే ఈ విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చారు. స్థపతుల పర్యవేక్షణలో విగ్ర నిర్మాణం తుది దశకు చేరుకుంటుంది. వచ్చే రెండు నెల (జులై.. ఆగస్టు)లో ఈ విగ్రహ భాగాలు ఆశ్రమానికి చేరుకుంటాయి. వాటిన్నింటిని కలిపి తర్వాత ప్రతిష్ఠిస్తారు.

ఈ ప్రాజెక్ట్ ఒక్క హైదరాబాద్ లోనే ఇంకెక్కడానా ఉందా?

-మొత్తం మూడు చోట్ల ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తారు. రామానుజులు ప్రపంచానికి నారాయణ మంత్రాన్ని ఇచ్చింది బద్రీనాథ్ లోనే. అందుకే అక్కడ అష్టాక్షరీ క్షేత్రం పేరిట ఆశ్రమం ఉంది. అక్కడ నుంచి ప్రాజెక్టు షురూ చేస్తారు. అక్కడ 27 అడుగుల ఎత్తు ఉన్న స్థూపం మీద రామానుజుల మూర్తిని ప్రతిష్ఠిస్తారు. ఈ సెప్టెంబరు లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రామానుజుల దివ్య క్షేత్రాలు ఉండాలన్న ఆకాంక్ష. అందుకే.. విజయవాడలోని విజయకీలాద్రి పర్వతం మీద 108 అడుగుల ఎత్తైన రామానుజుల సుధామూర్తిన ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీన్ని సిమెంటుతో తయారు చేస్తారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.అదే పర్వతం మీద శిథిలమైన ఎనిమిది ఆలయాల జీర్ణోద్ధరణ కూడా పూర్తి చేశారు. వాటిని కూడా ప్రారంభిస్తారు.

మొత్తం ప్రాజెక్టు వ్యయం ఎంత ఉంటుంది.. అంత మొత్తాన్ని ఎలా తెస్తారు?

-మొత్తం ప్రాజెక్టు విలువ రూ.800 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకూ. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి నిధుల సేకరణ ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. భారతీయులు ఉన్న ప్రతి దేశానికి వెళ్లి నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు.