Begin typing your search above and press return to search.

మోడీతో చిన్న జీయ‌ర్ భేటీ.. పాలిటిక్స్ చ‌ర్చించారా?

By:  Tupaki Desk   |   18 Sep 2021 5:30 PM GMT
మోడీతో చిన్న జీయ‌ర్ భేటీ.. పాలిటిక్స్ చ‌ర్చించారా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక వేత్త‌ల‌కు రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఏపీలో విశాఖ శార‌దా పీఠాధిప‌తి.. సీఎం జ‌గ‌న్‌కు ఆత్మ‌బంధువు అనే పేరు తెచ్చుకున్నారు. ఇక‌, తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. చిన్న జీయ‌ర్ స్వామి ఆత్మ బంధువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటు ఏపీలోను, ఇటు తెలంగాణ‌లోనూ.. ఈ ఇద్ద‌రు స్వాముల‌కు ముఖ్య‌మంత్రులు రెడ్ కార్పెట్ స్వాగ‌తాలు చెబుతున్న విష‌యం.. త‌ర‌చుగా వారి ఆశ్ర‌మాల‌కు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. పాల‌న‌లోనూ.. ఈ స్వాముల ప్ర‌మేయం ఉంద‌నేది అందరూ అంగీక‌రించే విష‌య‌మే.

అయితే.. తాజాగా.. చిన‌జీయ‌ర్ స్వామి.. ప్ర‌ధాన న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. నిజంగానే చిన‌జీయ‌ర్ ఈ భేటీలో రాజ‌కీయాలు చ‌ర్చించారా.. కేవ‌లం త‌న కార్య‌క్ర‌మాల‌కు, ఆశ్ర‌మానికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌కే ప‌రిమిత‌మ‌య్యారా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం.. చిన‌జీయ‌ర్ స్వామి.. భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు తెర‌దీసీన విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వీటిని ఘ‌నంగా.. దేశంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఆధిత్య‌క కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌ని విధంగా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా అతిరథ మహారథులను ఆహ్వానించడం కోసం చిన్నజీయర్‌ స్వామి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా శనివారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి ఆహ్వానపత్రికను అందించారు. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని ప్రధానిని కోరారు. చిన్నజీయర్‌ స్వామితో పాటు మైహోం గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు కూడా మోడీని కలిసి ప్రాజెక్టు విశేషాలను వివరించారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశిష్టతను, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను మోడీకి వివ‌రించారు.

ప్రపంచ శాంతి కోసం చిన్న జీయర్ స్వామి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించిన ప్రధాని మోడీ.. విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. రామానుజాచార్య పంచలోహ విగ్రహం కొలువుదీరుతుండడంతో శంషాబాద్‌‌లోని ముచ్చింతల్‌ ప్రాంతం ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త రూపును సంతరించుకోనుంది. విగ్రహావిష్కరణ మహోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, భారత ప్రధాన న్యాయమూర్తి.. ఇలా మహామహులకు కూడా ఆహ్వానంఅందింది. దీంతో వారంతా తరలి వస్తున్నార‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ ఈ మహోత్సవం జరగనుంది. విశ్వనగరంగా ఇప్పటికే పేరుపొందిన హైదరాబాద్‌కు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఈ మహోత్సవం గుర్తింపు తేనుందని అంటున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా చిన‌జీయ‌ర్ స్వామి ఏం సంప్ర‌దింపులు జ‌రిపి ఉంటార‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. చూడాలి.. దీనిపై ఎలాంటి వార్త‌లు వ‌స్తాయో!!