Begin typing your search above and press return to search.

సారుకు అదిరే పొగడ్త..బక్కోడే అయినా గట్టోడేనట!

By:  Tupaki Desk   |   28 Oct 2019 4:51 PM GMT
సారుకు అదిరే పొగడ్త..బక్కోడే అయినా గట్టోడేనట!
X
టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు స్వామీజీలంటే అలవిమాలిన భక్తి. స్వాములన్నా, స్వామీజీలు చేపట్టే పూజలన్నా - చివరకు స్వామీజీల జన్మదిన వేడుకలైనా కేసీఆర్ కు అత్యంత ప్రీతిపాత్రమేనని చెప్పక తప్పదు. స్వామీజీలపై కేసీఆర్ చూపే భక్తి ప్రత్యేకమే అయినా... కేసీఆర్ అంటే కూడా స్వామీజీలకు అంతే ఇష్టం. ఇక తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న చినజీయర్ స్వామి విషయానికి వస్తే... ఆయనతో కేసీఆర్ కు ప్రత్యేక అనుబంధమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఫ్యామిలీతో వచ్చిన కేసీఆర్ ను చినజీయర్ ఆకాశానికెత్తేశారు. ఇప్పటిదాకా ఏ ఒక్కరూ పొగడని రీతిలో కేసీఆర్ ను జీయర్ స్వామి పొగిడారు.

అయినా కేసీఆర్ ను జీయర్ స్వామి ఎమని పొగిడారంటే... కేసీఆర్ బక్కోడే అయినా కూడా మహా గట్టోడేనంట. నిజమే... ఈ తరహా పొగడ్తను కేసీఆర్ గతంలో విని ఉండరు. రాజకీయ ప్రత్యర్థులంతా బక్కోడిగా అభివర్ణించే కేసీఆర్ ను ఈ తరహాలో పొగిడిన వారు ఇప్పటిదాకా లేరనే చెప్పాలి. కేసీఆర్ ను ఆకాశానికెత్తేస్తున్న ఆయన సొంత పార్టీ నేతలు కూడా కేసీఆర్ ను గట్టోడిగా అభివర్ణించడంతోనే సరిపెట్టుకున్నారు. విపక్షాలు బక్కోడని - స్వపక్ష నేతలు గట్టోడని పిలిపించుకున్న కేసీఆర్ కు జీయర్ స్వామి పొగడ్త నిజంగానే అరుదనే చెప్పాలి. కేసీఆర్ ను బక్కోడిగా అభివర్ణించిన జీయర్... బక్కోడే అయినా కేసీఆర్ గట్టోడు అంటూ తనదైన శైలి పొగడ్త సంధించారు.

సరే... ఈ పొగడ్త తర్వాత కేసీఆర్ పై జీయర్ ఇంకేమని వ్యాఖ్యానించారన్న విషయానికి వస్తే... సీఎం హోదాలో కేసీఆర్ ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తూ - రాజకీయంగా ఆయనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని జీయర్ కొనియాడారు. సాధారణంగా రాజకీయాల్లో ఉండేవారు దేవుడి గురించి మాట్లాడటానికి భయపడతారని - కానీ సీఎం కేసీఆర్ దానికి వ్యతిరేకి అని - భగవద్భక్తికి ఆయన ఓ మంచి ఉదాహరణ అని అన్నారు. యాదాద్రి దేవస్థానాన్ని కాంతులీనే అద్భుత క్షేత్రంగా తయారు చేస్తున్నారని, భారతదేశంలోనే తలమానిక దేవాలయంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని స్వామీజీ ప్రశంసించారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని ఓ మిషన్‌ లా స్వీకరించారని - ఎన్నో యజ్ఞాలు - యాగాలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ బక్కవాడైనా గొప్పవాడని - మనస్సులో ఉన్న భక్తిని దాచుకోకుండా చెప్పగల గొప్ప ధైర్యవంతుడని చినజీయర్ స్వామీజీ కేసీఆర్‌ని ఓ రేంజిలో కొనియాడారు.