Begin typing your search above and press return to search.

తెలుగు తమ్ముళ్లు అలాంటి మాటలే చెబుతారు

By:  Tupaki Desk   |   30 April 2016 11:49 AM GMT
తెలుగు తమ్ముళ్లు అలాంటి మాటలే చెబుతారు
X
మీకెంతో సన్నిహితుడైన మిత్రుడు మీ గొంతు మీద కాలి పెట్టి తొక్కుతున్నాడనుకోండి.. ఎలా స్పందిస్తారు? ముద్దుముద్దుగా.. ప్రేమగా గొంతు నొక్కుతున్నాడని అనుకుంటారా? లేక.. ఫ్రెండ్ అన్న తర్వాత ఆ మాత్రం గొంతు నొక్కితే తప్పేముందని భావిస్తారా? లేక.. ఆత్మరక్షణ కోసం ఎదురు తిరుగుతారా? ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా వచ్చే సమాదానం.. ఆత్మరక్షణ కోసం ఎదురుతిరుగుతాననే చెబుతారు.

కానీ.. ఏపీ హోంమంత్రి చినరాజప్ప తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నిన్నటికి నిన్న ఏపీకి ప్రత్యేక హోదా హామీ విషయంలో కేంద్ర సహాయ మంత్రి ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని తేల్చి చెప్పిన తర్వాత.. బీజేపీతో సంబంధాల గురించి తొందరపడి ఒక మాట చెప్పేందుకు ఇష్టపడరు. కానీ.. కేంద్రంలోని మోడీ సర్కారు ఏం చేసినా.. ఏపీ ప్రయోజనాల్ని ఎంతగా దెబ్బ తీసినా.. సిగ్గులేకుండా వారితో రాసుకుపూసుకు తిరుగుతామన్న చందంగా మాట్లాడటం తెలుగుదేశం నేతలకే చెల్లుతుందేమో.

తమకు తమ ప్రజలు.. తమ రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే ఇంకేమైనా అన్న విషయాన్ని తేల్చి చెప్పాల్సింది పోయి.. 2019 ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పటం తెలుగు తమ్ముళ్లకే చెల్లుతుందేమో. బీజేపీతో టీడీపీ స్నేహాన్ని కొనసాగిస్తుందని చెప్పిన చినరాజప్ప.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రత్యేక హోదా మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారన్న ఆశాభావాన్ని చినరాజప్ప వ్యక్తం చేశారు. ఈ తరహా మాటలే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు చెప్పటం తెలిసిందే. అప్పుడు రాష్ట్ర విభజన జరిగినట్లే.. ఈసారి ప్రత్యేక హోదా మాట తూచ్ అనటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయినా.. ఓపక్క కేంద్ర సహాయ మంత్రి ప్రత్యేక హోదా గురించి కుండబద్ధలు కొట్టిన తర్వాత కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేయటం ఏమిటి ఎటకారంగా..?