Begin typing your search above and press return to search.

చినరాజప్ప నాయకత్వంలో 2019 ఎన్నికలకు

By:  Tupaki Desk   |   17 April 2017 6:22 AM GMT
చినరాజప్ప నాయకత్వంలో 2019 ఎన్నికలకు
X
ఏపీలో మంత్రివర్గ విస్తరణ తరువాత పాలక టీడీపీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వచ్చే నెలలో జరగనున్న మహానాడు వేదికగా కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళావెంకటరావును మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మహానాడులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షునిగా దాదాపుగా ఎన్నిక కానున్న చంద్రబాబు తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తారు. ఈ సంప్రదాయం టీడీపీ ఆవిర్భావం నుంచి వస్తోంది. తెలుగు రాష్ట్రాన్ని విభజించిన అనంతరం వచ్చే నెలలో జరుగనున్న మహానాడుకు రాజకీయ ప్రాధాన్యం ఉంది. 2019లో జరుగనున్న సాధారణ ఎన్నికలకు వచ్చే మహానాడు దిశా నిర్దేశం చేయనుండడంతో ముఖ్యమంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ కు రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం నుంచి టీడీపీ సారథిని ఎంపిక చేయనున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కిమిడి కళావెంకట్రావు స్థానంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చినరాజప్ప నాయకత్వంలోనే 2019లో ఏపీలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే పార్టీ కేడర్‌ కు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.

మరోవైపు 5 సార్లు పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి కూడా ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని సమాచారం. మంత్రి పదవి దక్కకపోయినా కనీసం అధ్యక్ష పదవి దక్కుతుందనే ఆశాభావంతో నరేంద్ర ఉన్నారని, ముఖ్యమంత్రి నుంచి ఈ మేరకు హామీ లభించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఒకవేళ చంద్రబాబు అనుకున్నట్లు చినరాజప్పనే పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఆయనకు మంత్రి పదవి బాధ్యతలను తప్పిస్తారని తెలుస్తోంది. అప్పుడు మంత్రివర్గంలోకి ఆయన స్థానంలో ఇంకొకరికి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే జూన్ లోగా మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/