Begin typing your search above and press return to search.

తెలుగుదేశంతో పొత్తు వద్దంటే వద్దు

By:  Tupaki Desk   |   25 May 2017 11:14 AM GMT
తెలుగుదేశంతో పొత్తు వద్దంటే వద్దు
X
2014 ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు.. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దంటే వద్దన్నారు. కానీ ఆంధ్రా నాయకులు మాత్రం ఆ పార్టీతో పొత్తు కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రా నాయకులు సైతం తెదేపాతో పొత్తు వద్దే వద్దంటుండటం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాల్సిన అవసరమే లేదని.. పొత్తు లేకుండా సొంతంగా బరిలోకి దిగుదామని ఆ ప్రాంత నాయకులు పట్టుబడుతుండటం గమనార్హం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద ఆ ప్రాంత సీనియర్ నాయకులు మొర పెట్టుకున్నట్లు సమాచారం. షాను కలిసిన ఏపీ భాజపా నేతలందరూ.. తెలుగుదేశంతో పొత్తు వద్దంటూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో భాజపాతో జట్టు కట్టడం వల్ల తెలుగుదేశం బాగా లాభపడిందని.. ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించడం లేదని.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనిపిస్తోందని.. అది తమ పార్టీని కూడా దెబ్బ తీస్తుందని.. కాబట్టి తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకోవడమే మేలని భాజపా నేతలు షా వద్ద అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం నాయకులు భాజపాపై విమర్శల దాడి పెంచుతున్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని పరిశీలిద్దామని షా అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సమావేశం సందర్భంగా షా ఆయనతో ఏం మాట్లాడాడో మరి. మరోవైపు ప్రముఖ రచయిత చిన్నికృష్ణ.. అమిత్ షా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకోవడం విశేషం. మోడీ ప్రధాని కావడంతో మళ్లీ గాంధీ వచ్చినట్లుగా ఉందని.. ఆయన పాలనకు ఆకర్షితుడైనందు వల్లే భాజపాలో చేరానని చిన్నికృష్ణ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/