Begin typing your search above and press return to search.

మరీ ఇన్ని పంచులా : బాబోయ్ అనిపిస్తున్న అయ్యన్న

By:  Tupaki Desk   |   16 May 2022 1:30 PM GMT
మరీ ఇన్ని పంచులా : బాబోయ్ అనిపిస్తున్న అయ్యన్న
X
ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరున్నర పదుల వయసులో కూడా నాటౌట్ అంటున్నారు. ఎన్నో యుద్ధాలను చూసిన తనకు జగన్ సర్కార్ ఒక లెక్క అని లైట్ తీసుకుంటున్నారు. చిత్రమేంటి అంటే టీడీపీలో గండరగండలు అనుకున్న మహా నాయకులు అందరినీ వైసీపీ సర్కార్ గత మూడేళ్ల కాలంలో అరెస్టులు చేసేసింది. అయినా సరే అయ్యన్నపాత్రుడు మాత్రం ఈ రోజుకీ అరెస్ట్ కాలేదు.

అదొక్కటి చాలు అయ్యన్నా మజాకా అని చెప్పడానికి. ఇక అయ్యన్న తెల్లారితే చాలు వీడియో క్లిప్స్ తయారు చేసి మరీ జగన్ సర్కార్ మీద అలా వదిలేస్తూంటారు. తన నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యేతో మొదలుపెట్టి మినిష్టర్లు సహా మాటలతో దాడి చేస్తూ జగన్ దాకా ఆయన దారుణమైన విమర్శలు చేస్తారు. అయ్యన్న చేసే విమర్శలు దాదాపుగా వ్యక్తిగతంగానే ఉంటాయి.

ఇంత ధాటీగా సూటిగా విమర్శలు చేసే నేతలు టీడీపీలోనే కాదు, తెలుగు రాజకీయాల్లోనే ఎవరూ లేరంటే నిజమనే అనుకోవాలి. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అయ్యన్న వైసీపీ సర్కార్ వెంటినెటర్ మీద ఉందని బాంబు పేల్చేశారు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కృంగి కృశించిపోయిందని కూడా విమర్శలు లంకించుకున్నారు.

అప్పులు తప్పులు వరసబెట్టి చేస్తూ బాగా ఆనారోగ్యానికి గురి అయిందని కూడా అన్నారు. ఈ సర్కార్ వెంటిలేటర్ ని ఏ క్షణం అయినా తీసేయవచ్చు అని అపుడు ఈ సర్కార్ ని పూడ్చిపెట్టడానికి తాము శ్మశానంలో అన్నీ రెడీ చేసి పెట్టామని అయ్యన్న హాట్ హాట్ పంచులే పేల్చారు. అంతే కాదు జగన్ సర్కార్ కి తలకొరివి ఎపుడెపుడు పెడదామా అని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు అయ్యన్న.

మొత్తానికి అయ్యన్న మార్క్ పంచులుగా వీటిని చూడాలి. ఇంతలా ఏ ప్రభుత్వం మీద ఈ ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేయడు, చేయలేడు కూడా. మరి పంచులకే అల్టిమేట్ అన్నట్లుగా అయ్యన్న వరసబెట్టి రోజుల తరబడి పేలుస్తున్నా ఆయన్ని ఏమీ చేయలేని దైన్యం వైసీపీ సర్కార్ ది. చూస్తుండగా మూడేళ్ళు ఇట్టే గడచిపోయాయి.

ఇక మరో రెండేళ్లు అంటే ఇదే అయ్యన్న చెప్పినట్లుగా 2023 వస్తే అధికారులే మాట వినరట. దాంతోనే అయ్యన్న తగ్గేదిలే అంటున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా చెప్పేస్తున్నారు. మరి అయ్యన్న పంచులకు కౌంటర్లు వేసే సీన్ వైసీపీలో ఉందా. ఏమో ఎపుడైనా వైసీపీ మీద అయ్యన్నదే పై చేయి అవుతోంది. అవతల వారికి అలుపూ సొలుపూ ఉండొచ్చు కానీ అయ్యన్న మాత్రం అసలు నేను రెడీ అనే అంటారు. ఇక వెంటిలేటర్ మీద వైసీపీ సర్కార్ అన్న కామెంట్ మాత్రం ఇపుడు తెగ వైరల్ అవుతోంది.