Begin typing your search above and press return to search.

జూనియర్ పాత్రుడి మాస్ అవతార్...తమ్ముళ్ళ హుషార్

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:09 AM GMT
జూనియర్ పాత్రుడి మాస్ అవతార్...తమ్ముళ్ళ హుషార్
X
మొత్తానికి నర్శీపట్నం ఎపిసోడ్ లో వైసీపీ సాధించింది ఏంటి అంటే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంట మరో సూపర్ పవర్ ని క్రియేట్ చేయడం. అయ్యన్నది నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. ఆరున్నర పదులు దాటిన వయసు. ఆయనకు అందివచ్చిన కొడుకు ఉన్నా ఆయన సత్తా ఏంటో తేల్చుకునే సందర్భం అయితే ఇప్పటిదాకా రాలేదు.

తీరి కూర్చుని ఆ ముచ్చటను తీర్చేసింది వైసీపీ నాయకత్వం. ఎంతో ప్రయాసపడి ఆయాసపడి ఆఖరుకు అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహారీ గోడను మాత్రమే టచ్ చేయగలిగింది, అంతకు మించి టన్నుల కొద్దీ విమర్శలను మూటకట్టుంది. అయితే అదే సమయంలో జూనియర్ అయ్యన్నపాత్రుడి మాస్ దూకుడుని యావత్తు టీడీపీకే కాదు నర్శీపట్నం జనానికి కూడా చూపించగలిగింది.

అయ్యన్న కొడుకు విజయ్ పాత్రుడు బాగా చదువుకున్న వాడు. మంచిగా మాట్లాడగలిగే దమ్మున్నవాడు. పైపెచ్చు యువకుడు. తండ్రిది మాస్ అయితే కొడుకు క్లాస్ అని ఇప్పటిదాకా అనుకుంటూ వచ్చారు అంతా. ఎపుడైతే తన ఇంటి ప్రహారీ మీద బుల్డోజర్ టచ్ చేసిందో విజయ్ కూడా పక్కా మాస్ అయిపోయారు. టోటల్ ఎపిసోడ్ లో అయ్యన్న తెర వెనక ఉంటే మొత్తం కధను నడిపించి సక్సెస్ అయ్యాడు విజయ్.

అంతే కాదు అధికార వైసీపీ మీద పంచ్ డైలాగులు పేల్చడంలో కానీ మునిసిపల్ రెవిన్యూ అధికారులనే కాదు, పోలీసులను కూడా నిలదీసి ఎలా గోడ కొట్టేస్తారు అని నిగ్గదీయడంలో కానీ విజయ్ మార్క్ లాజిక్ కి అంతా బిత్తరపోవాల్సి వచ్చింది. ఆ తరువాత బిగ్ పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చి మొత్తం సీన్ ని తమ వైపునకు తిప్పుకున్న నేర్పు కూడా ఆయనదే.'

తమ ఇంటి గోడను అన్యాయంగా కూల్చినందుకు నిరాహార దీక్షను చేపట్టి వైసీపీ తప్పు ఏంటో లోకానికి తెలియచేసిన మాస్టర్ ప్లాన్ కూడా విజయ్ దే. అంతే కాదు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పేల్చిన డైలాగులు కూడా వైసీపీ గుండెల్లో గునపాలనే దించేలా ఉన్నాయి.

కనీసం కామన్ సెన్స్ లేకుండా మా ఇంటి మీదకు వచ్చారు. ఏం సాధించామనుకుంటున్నారు. ఇంతకు మించి వేయి రెట్లు బిగ్ సౌండ్ చేస్తాం, మీరు మంచే చేశారు. ఇంకా కసి పెంచారు, కానీ ఒక్కటి ఇక్కడ రుజువు అయింది. మీ భయమే ఇలా మా ఇంటి మీదకు బుల్డోజర్ ని పంపించింది అని జనాలకు తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని ముందే ఒప్పుకున్నారు. నేను చెబుతున్నా రాసి పెట్టుకోండి ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ నంబరే దక్కుతుంది. ఇదే నిజం అంటూ విజయ్ ఇచ్చిన స్పీచ్ కి తమ్ముళ్లు ఖుషీ అయితే మొత్తానికి మొత్తం నర్శీపట్నం ఎపిసోడ్ బెడిసికొట్టడంతో వైసీపీ ప్లాన్ బూమరాంగ్ అయింది అని ఫ్యాన్ పార్టీ చింతించాల్సిన పరిస్థితి.

ఇక అయ్యన్న నా కొడుక్కి టికెట్ అని అడగనక్కరలేదు. టీడీపీ ఈసారి కన్ ఫర్మ్ చేసేది ఆయనకే. మొత్తానికి ఇలా అనేక రకాలుగా వైసీపీ అయ్యన్న ఫ్యామిలీకి హెల్ప్ చేసింది అని టీడీపీ శిబిరంలో చర్చ సాగుతోందంటే బ్లండర్ మిస్టేక్ ఎవరిదో అర్ధం కావడం లేదూ