Begin typing your search above and press return to search.

చేప‌ల లారీల‌తో రెచ్చిపోయిన చింత‌మ‌నేని?

By:  Tupaki Desk   |   3 Sep 2017 4:51 AM GMT
చేప‌ల లారీల‌తో రెచ్చిపోయిన చింత‌మ‌నేని?
X
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తూ.. ఏపీ అధికార‌ప‌క్షానికి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త త‌ల‌నొప్పులు తీసుకురావ‌టంలో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తీరే వేరుగా ఉంటుంద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. గ‌తంలో ఇందుకు సంబంధించి ప‌లు ఉదంతాలు చోటు చేసుకోవ‌టం తెలిసిందే. ఎవ‌రెన్ని అన్నా.. వేటిని ప‌ట్టించుకోకుండా త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఆయ‌న తీరు తాజాగా మ‌రోసారి వివాదాస్ప‌ద‌మైంది.

త‌న ప్ర‌యోజ‌నాల కోసం ఎంత‌కైనా తెగిస్తార‌న్న పేరున్న చింత‌మ‌నేని తాజాగా చేప‌ల‌తో చెల‌రేగిపోయారు. అక్ర‌మ చేప‌ల సాగుకు ప్ర‌య‌త్నించిన ఆయ‌న్ను అధికారులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా ప‌ట్టించుకోలేదు. వార్నింగ్ ఇచ్చి మ‌రీ త‌న‌కు త‌గ్గ‌ట్లుగా ప‌రిస్థితిని మార్చుకున్న ఆయ‌న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

కొల్లేరులో తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఎంత అధికారంలో ఉంటే మాత్రం మ‌రీ ఇంత బ‌రితెగింపా? అన్న ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలు ఇస్తూ.. త‌న‌దైన రూల్ బుక్ ను త‌యారు చేసుకొని ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నట్లుగా చెప్పే ఆయ‌నిప్పుడేం చేశారంటే..

ఏలూరు మండ‌లం ప్ర‌త్తికోళ్ల‌లంక ప‌రిధి అట‌వీ భూమిలో 100 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న రెండు చెరువుల్లో అక్ర‌మ చేప‌ల సాగుకు య‌త్నించారు. ప‌ది లారీల్లో చేప పిల్ల‌ల్ని తీసుకొని చెరువు వ‌ద్ద‌కు త‌ర‌లించారు.

చెరువుల్లో చేప‌ల్ని వేయాల‌ని అనుచ‌రుల‌కు ఆదేశాలు జారీ వెళ్లిపోయారు. ఈ విష‌యం గురించి తెలుసుకున్న పెద‌పాడు.. భీమ‌డోలు.. ఏలూరు అట‌వీ అధికారులు సిబ్బందితో అధికారుల‌తో వ‌చ్చారు. ఇందుకు ప్ర‌తిగా చింత‌మ‌నేని 50 మంది అనుచ‌రుల‌తో చెరువు వ‌ద్ద‌కు చేరుకొని చెల‌రేగిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

త‌న‌కు తోచిన‌ట్లు చేస్తాన‌ని.. అందుకు అడ్డుకునే వారిని విడిచిపెట్ట‌న‌ని బెదిరింపుల‌కు దిగ‌టం గ‌మ‌నార్హం. ఎవ‌డ్రా.. ప‌నుల్ని అడ్డుకుంటున్న‌ది.. చెరువులో చేప పిల్ల‌ల్ని వేయండి.. ఎవ‌డు అడ్డువ‌స్తాడో నేనూ చూస్తానంటూ రెచ్చిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

చింత‌మ‌నేని అనుచ‌రులు చేప‌ల పిల్ల‌ల్ని చెరువులో వేసేందుకు ప్ర‌య‌త్నించ‌టం..వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ అట‌వీ శాఖాధికారుల‌ను మ‌రోసారి చింత‌మ‌నేని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించిన‌ట్లుగా చెబువుతున్నారు. త‌మ‌ను అడ్డుకుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్నారు. దీంతో అధికారులు వెన‌క్కి త‌గ్గారు. దీన్ని అదునుగా చేసుకొని చింత‌మ‌నేని అనుచ‌రులు లారీల్లో తీసుకొచ్చిన చేప పిల్ల‌ల్ని చెరువులో వేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కొంత‌మంది వీడియోలు.. ఫోటోలు తీయ‌గా.. అంద‌రి ద‌గ్గ‌రి నుంచి ఫోన్లు తీసుకున్న‌చింత‌మ‌నేని వాటిలోని స‌మాచారాన్నిడిలీట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. తాజా ఉదంతంపై ఉన్న‌తాధికారుల‌కుకంప్లైంట్ చేయాల‌ని అట‌వీశాఖాధికారులు నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు.