Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌పై చింత‌మ‌నేని దాడి

By:  Tupaki Desk   |   16 Nov 2018 8:03 AM GMT
వైసీపీ నేత‌పై చింత‌మ‌నేని దాడి
X
వివాదాస్ప‌ద మాట‌లు - చ‌ర్య‌ల‌కు మారుపేరైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మ‌రోసారి రెచ్చిపోయారు. ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ఓ నేత‌ను కిడ్నాప్ చేసి - చిత‌క‌బాదారు. దీంతో ఆయ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

అస‌లేం జ‌రిగిందంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు - పెదవేగి మండలం గార్లమడుగు మాజీ సర్పంచ్ మేడికొండ వెంకట సాంబశివ కృష్ణారావు గురువారం ఉదయం ఏలూరు నుంచి గార్లమడుగు వెళ్తున్నారు. మార్గమధ్యలో పోలవరం కుడి కాలువ గట్టుపై ఎమ్మెల్యే చింతమనేని వాహనాలు - ప్రొక్లెయిన్ - టిప్పర్‌ లు ఆయ‌న‌కు క‌నిపించాయి. కాల‌వు మట్టిని తవ్వి తరలిస్తున్నారని గుర్తించి.. పోలవరం ఇరిగేషన్‌ ఎస్‌ ఈకి ఫోన్‌ లో కృష్ణారావు ఫిర్యాదు చేశారు. దీంతో మీరు అక్క‌డే ఉండాల‌ని.. వెంట‌నే ఓ అధికారిని పంపిస్తాన‌ని ఆయ‌న‌కు ఎస్ ఈ చెప్పారు.

అయితే - అధికారి కంటే ముందుగానే అక్కడికి చింత‌మ‌నేని అనుచరులు చేరుకున్నారు. కృష్ణారావుపై దాడికి పాల్ప‌డ్డారు. ఆయ‌న్ను కారెక్కించుకొని దుగ్గిరాల‌లోని చింత‌మ‌నేని ఇంటికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కూడా అక్కడ కృష్ణారావుపై దాడి చేరు. కాలితో త‌న్నారు. దీంతో కృష్ణారావు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆపై బాధితుణ్ని దూరంగా వదిలేసి వెళ్ళిపోయారు.

కృష్ణారావుపై దాడి సంగ‌తి తెలుసుకున్న వైసీపీ పెద‌వేగి పోలీస్ స్టేష‌న్ చేరుకొని ధ‌ర్నా చేప‌ట్టారు. చింత‌మ‌నేనిపై కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు చింత‌మ‌నేనితోపాటు ఆయ‌న గ‌న్‌ మెన్‌ లు - కొంద‌రు టీడీపీ నేత‌ల‌పై కృష్ణారావు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. చింతమనేని తీరు గ‌తంలోనూ ప‌లుమార్లు వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి గ‌మ‌నార్హం. త‌న ఇసుక మాఫియాకు అడ్డొచ్చిన అధికారుల‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని, ప్రజలను కులం పేరుతో దూషించార‌ని ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లున్నాయి.
--