Begin typing your search above and press return to search.

ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరణ .. చింతమనేని హౌస్ అరెస్ట్ !

By:  Tupaki Desk   |   10 Jan 2020 10:41 AM GMT
ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరణ .. చింతమనేని హౌస్ అరెస్ట్ !
X
అమరావతి రాజధాని ప్రాంతం రణరంగాన్ని తలపిస్తోంది. అందోళనలు.. అరెస్టులతో అమరావతి అట్టుడుకుతోంది. 24 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోవడంతో, మహాధర్నాలు, హైవే దిగ్భంధానాలు, రిలే దీక్షలతో ఉద్యామాన్ని ఇంకాస్త ఉధృతం చేస్తున్నారు. అయితే మరోవైపు ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే పేరుతో ఎక్కడిక్కడ టీడీపీ లీడర్లను, జేఏసీ నేతలను అడ్డుకుంటున్నారు. ముందస్తుగానే హౌస్‌ అరెస్టులుచేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ ముఖ్యనాయకులను గృహ నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఎంపీ కేశనేని నానిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయన తన వ్యక్తిగత పని పై బయటకు వెళ్తున్నా అని చెప్పినా కూడా పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి జంక్షన్‌ దగ్గర జాతీయ రహదారిపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడ్ని పోలీసులు అడ్డుకున్నారు. రైతుల కోసం రాజమండ్రి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని కలవడానికి వస్తున్న నేపథ్యంలో తణుకులో రామానాయుడ్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

అలాగే ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అమరావతి పరిరక్షణ బస్సుయాత్ర నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు చింతమనేని ని అరెస్ట్‌ చేశారు. ఏలూరు, దెందులూరు హైవే మీదుగా, తాడేపల్లిగూడెం, తణుకు నుండి చంద్రబాబు బస్సుయాత్ర కొనసాగాల్సి ఉంది. దీనితో ఆయనని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీంతో చింతమనేని ఇంటి ముందు బైఠాయించి మరీ ఆందోళన చేస్తున్నారు. కనీసం తమ పార్టీ అధినేత చంద్రబాబు ను కూడా కలవకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చింతమనేని తన ఇంటి ముందే ఆందోళనకు దిగారు.