Begin typing your search above and press return to search.

చింతమనేనికి షాకులే షాకులు..ఇంకొన్నాళ్లు జైల్లోనే!

By:  Tupaki Desk   |   25 Sep 2019 3:37 PM GMT
చింతమనేనికి షాకులే షాకులు..ఇంకొన్నాళ్లు జైల్లోనే!
X
టీడీపీ సీనియర్ నేత - పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కు నిజంగానే ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా... తనదైన రేంజిలో రెచ్చిపోయిన చింతమనేనికి... వైసీపీ అధికారంలోకి రాగానే కష్టాలు మొదలయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో పాటు తాను కూడా చిత్తుగా ఓడినా... చింతమనేని తన వ్యవహార సరళిని ఎంతమాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో దళితులను కులం పేరుతో దూషించారన్న కేసులో ఇరుక్కున్న చింతమనేని ప్రస్తుతం జైల్లో ఉంటున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని చింతమనేని దాఖలు చేసుకున్న పిటిషన్ ను బుధవారం ఏలూరు కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ షాకిచ్చింది.

బుధవారం బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా పోలీసులు చింతమనేనిని ఏలూరు లోని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే నెల 9 వరకూ చింతమనేని రిమాండ్‌ ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దళితులను దూషించిన కేసులో చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్న చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. దళితులు దూషించిన కేసు మాత్రమే కాకుండా , చింతమనేని పై కేసు పెట్టిన వారిని చంపుతానని హెచ్చరించారని మరో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. వరుస కేసులను ఎదుర్కొంటున్న చింతమనేనిని బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

2017లో ఒక స్థలం వివాదంలో వ్యక్తిని నిర్బంధించి - కులం పేరుతో దూషించిన ఘటనలోనూ చింతమనేనిపై కేసు నమోదైంది. అంతకుముందు మహిళా తహశీల్దార్ పైనా ప్రత్యక్షంగా దాడికి దిగిన చింతమనేని వ్యవహారం వివాదాస్పదైమంది. తాజాగా ఇటీవల చింతమనేని పినకడిమి శివారులో ఎడ్లబళ్లపై ఇసుక తీసుకువెళుతున్న దళితులను అడ్డుకుని - వారిని కులం పేరుతో దూషించారని దళితులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. దళితులు చేస్తున్న ఆందోళనకు దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మద్దతునిచ్చారు. చింతమనేనిపై దళితులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టటంతో ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ విచారణ చేపట్టారు. ఆ తరువాత చింతమనేనిని అరెస్ట్ చేశారు. తాజాగా చింతమనేని బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేయడంతో ఇప్పుడప్పుడే చింతమనేని బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.