Begin typing your search above and press return to search.

నేనింతే మార‌ను - చింత‌మనేని

By:  Tupaki Desk   |   18 Nov 2018 1:17 PM GMT
నేనింతే మార‌ను - చింత‌మనేని
X
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. అధికారులు - ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం - అసభ్య పదజాలం వాడటం వంటి పనులతో వివాదాస్పదమవుతున్నారు. ఇటీవల దెందులూరు సభలో మాట్లాడుతూ చింతమనేనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అటు వైసీపీ అధినేత జగన్ కూడా చింతమనేని ప్రభాకర్‌ నే టార్గెట్ చేశారు. ఒక్కరు చేసే తప్పునకు పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని పలువురు సీనియర్లు చంద్రబాబు వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్‌ పై టీడీపీ అధినేత‌ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, దీనికి అనూహ్య రీతిలో ఆయ‌న స్పందించారు.

ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పని చేస్తే సరిపోదని పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు చింతమనేనికి తేల్చి చెప్పారు. అధినాయకత్వానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించినట్లు సమాచారం. ఇదే లాస్ట్ వార్నింగ్ అని ఈసారి వివాదాల్లో చిక్కుకుంటే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, త‌న‌పై చంద్ర‌బాబు ఫైర్ అయిన‌ప్ప‌టికీ - చింత‌మ‌నేని త‌న మునుప‌టి దూకుడును కొన‌సాగించారు. వేంపాడులో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నేతలతో కలిసి చింతమనేని పాల్గొన్నారు. స్థానికంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి బయటివాడు వచ్చే అవకాశమే లేదని - తమపై వచ్చిన ఫిర్యాదులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు - సీఎం చంద్రబాబుకే సమాధానమిస్తానని వ్యాఖ్యానించారు.తాను ప్రజా నాయకుడిననీ - ఇలాగే ఉంటానని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ‘నేనింతే.. నేను ఇలాగే ఉంటా. నేనేమీ వందల కోట్ల ఆస్తులు సంపాదించలేదు. పేదలకు కష్టం వస్తే.. ఆ కష్టం కలిగించినవాడు ఎంతగొప్ప వాడైనా వదలను. నాకు వ్యతిరేకంగా కొందరు టీడీపీ నేతలు ప్రతిపక్షాల ట్రాప్ లో పడ్డారు’ అని తేల్చిచెప్పారు.తాను చేపడుతున్న మంచి పనులను ఎవ్వరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ...ఇలా టేక్ ఇట్ ఈజీగా స్పందించ‌డం ఆస‌క్తిని సృష్టిస్తోంది.

కాగా, నియోజకవర్గంలోని పెదపాడు మండలం వేంపాడులో మాజీ సర్పంచ్‌ పై చింతమనేని చేయి చేసుకున్న ఉందంతంపై ఆయ‌న ఆస‌క్తికరంగా స్పందించారు. మాజీ సర్పంచ్‌ పై తీవ్ర ఆగ్రహానికి లో నైన గ్రామస్తులు టీడీపీ జెండాలు - ఫ్లెక్సీలను తగులబెట్టారు. చింతమనేని డౌన్‌ డౌన్ అంటూ నినాదాలంతో హోరెత్తించారు. గ్రామంలోకి రావడానికి యత్నించిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు.. దీనిపై తాజాగా చింత‌మ‌నేని స్పందిస్తూ స్థానికంగా స్కూలులో చదువుకుంటున్న ఓ విద్యార్థినికి లోన్ ఇప్పించే విషయంలో పెదవేగి మాజీ సర్పంచ్‌ మేడికొండ సాంబశివ కృష్ణారావుతో తనకు అభిప్రాయభేదాలు వచ్చాయని చెప్పారు. అంతే తప్ప తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు.