Begin typing your search above and press return to search.

చింతమనేని వారి వేదన విన్నారా?

By:  Tupaki Desk   |   17 Nov 2019 5:21 AM GMT
చింతమనేని వారి వేదన విన్నారా?
X
ఏపీలో చంద్రబాబు సర్కారు హయాంలో అప్పటి దెందులూరు ఎమ్మెల్యేగా వ్యవహరించిన చింతమనేని ప్రభాకర్ వారి హవా ఎలా నడిచిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. తనకు తిరుగులేదని.. తాను తలుచుకుంటే ఏమైనా చేస్తానంటూ తరచూ చెలరేగిపోయేవారు. ఆయనేం చేసినా చట్టం తన పని తాను చేసుకునే విషయంలో వెనుకా ముందు ఆడేది. అలాంటి చింతమనేని వారి సీన్ మొత్తంగా మారింది.

ఏపీలో జగన్ సర్కారు హయాంలో ఆయనపై కేసుల వరద పారింది. ఆయన బాధితులుగా పేర్కొన్న పలువురు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయటం అవన్నీ కలిపితే ఏకంగా 18 కేసులుగా మారి.. గడిచిన కొంతకాలంగా జైల్లోనే ఉన్న పరిస్థితి. తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన.. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చింతమనేని వారి నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాల్లాంటి మాటలు వింటే.. ఓలమ్మో.. ఓలమ్మో.. ఎంత అన్యాయం జరిగిపోయినాది అన్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

తనపై అన్యాయంగా ఎస్సీ.. ఎస్టీ కేసులు పెట్టారని.. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గ పరిధిలోని ఏ గ్రామానికి వెళ్లినా.. తనకు వ్యతిరేకంగా ఏ దళితులు మాట్లాడలేరన్నారు. దళిత వ్యతిరేకి చింతమనేని అన్న ముద్ర వేసేందుకు భారీగా కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు.
ఇతరులకు సాయం చేసేందుకు సొంత ఆస్తుల్ని తగలేసుకునేవాడినని.. తాను ఏ దళితుడి ఆస్తి కోసం ఆశ పడలేదన్నారు. తనపై పెట్టిన ఒక్క కేసులో తాను తప్పు చేసినట్లు తేలినా.. ప్రపంచం నుంచే నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

దళితులు ఎవరూ తనపై కేసులు పెట్టలేదని.. తనపై కేసు పెట్టిన వ్యక్తిని తాను సరిగా గుర్తించలేనని చెప్పారు.తమ సామాజిక వర్గానికి చెందిన వారే వెనుకుండి తన మీద అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు. ఏపీ సీఎం మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారని.. ఆయన పలు మంచి పథకాల్ని అమలు చేస్తున్నారన్నారు.

మంచి పథకాలే కాదు.. శాంతిభద్రతలు కూడా పట్టించుకోవాలన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో తనను దళితే వ్యతిరేకి అనిపిస్తే తనకెవ్వరూ శిక్షలు వేయనక్కర్లేదని.. తానే దోషినని ఒప్పుకుంటానన్నారు. రాజకీయాలకు పనికి రానని చెబితే శాశ్వితంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. వనజాక్షి వ్యవహారాన్ని ఇప్పటికి ప్రచారం చేస్తున్నారని.. ఈ ఉదంతంపై అప్పట్లోనే తనపై కేసు పెట్టారన్నారు.

ఇప్పుడు ఉన్నది జగన్ ప్రభుత్వమే కదా? వనజాక్షి వ్యవహారంపై విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. తాను జైలు నుంచి వస్తున్న వేళలోనూ పోలీసులు అతి చేశారని.. అంత చేయాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారన్న చింతమనేని.. తనపై పెట్టిన కేసులకు ఆర్నెల్లు జైలుశిక్ష పడుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మీదా విమర్శలు చేయటం గమనార్హం.