Begin typing your search above and press return to search.

ఈసారి టైమ్ చింతమనేనిది.. ఏపీ ప్రభుత్వంపై ప్రైవేటు కేసు

By:  Tupaki Desk   |   27 May 2022 3:29 AM GMT
ఈసారి టైమ్ చింతమనేనిది.. ఏపీ ప్రభుత్వంపై ప్రైవేటు కేసు
X
చింతమనేని ప్రభాకర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు గెలుపొందారు.. చింతమనేని. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా వ్యవహరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చింతమనేని ప్రభాకర్ కు చుక్కెదురు అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొఠారు అబ్బయ్య చౌదరి.. చింతమనేనిపై విజయం సాధించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే చింతమనేని ప్రభాకర్ ను లక్ష్యంగా చేసుకుని అనేక కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులపాటు ఆయనను జైలులో పెట్టింది. అంతేకాకుండా ఒక కేసులో బెయిల్ పైన బయటకు వచ్చిన వెంటనే గ్యాప్ లేకుండా మరో కేసు పెట్టి ఆయనను వెంటాడింది. ఇలా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడమే సరిపోయింది.. చింతమనేనికి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో విసిగి వేసారిపోయిన చింతమనేని ప్రభాకర్ దానిపైన తాజాగా ప్రైవేటు కేసు దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనానికి కారణమైంది. జగన్ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు బనాయిస్తోందని ఏలూరు కోర్టులో చింతమనేని ప్రైవేటు కేసు పెట్టారు. ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు), వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సహా మాజీ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఎస్సీ రాహుల్ దేవ్ శర్మ తదితరులపై కేసు నమోదు చేశారు. దీంతో ఏలూరు కోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి దారితీసిన ప్రధాన కారణాల్లో చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి కూడా కారణమని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం హయాంలో ముసునూరు తహసీల్దార్ గా పనిచేస్తున్న వనజాక్షి తన ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడిందని.. చింతమనేని ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చి కొట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చింతమనేనికి మద్దతుగా నిలవడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అంతేకాకుండా ఆందోళనలు నిర్వహించాయి.

తహసీల్దార్ వనజాక్షి వ్యవహారమే కాకుండా పలువురిపై దాడి చేయడం, బూతులు తిట్టడం, దళితులపై నోరు పారేసుకోవడం, పోలీసులపై దాడి, దౌర్జన్యం వంటివి చేశారని చింతమనేనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట చింతమనేనిని లక్ష్యంగా చేసుకుందనే విమర్శలు ఉన్నాయి.