Begin typing your search above and press return to search.

అప్పటి వైఎస్ వీర విధేయుడు జగన్ మీద ఇన్ని నిప్పులు చెరిగారా?

By:  Tupaki Desk   |   20 Sep 2022 10:39 AM GMT
అప్పటి వైఎస్ వీర విధేయుడు జగన్ మీద ఇన్ని నిప్పులు చెరిగారా?
X
చింతా మోహన్ అన్నంతనే ఆయన ముఖం చాలామంది తెలుగు వారికి గుర్తుకు రాకపోవచ్చు కానీ..ఆయన బ్యాక్ గ్రౌండ్ ఒక్కసారి కళ్ల ముందు కదలాడుతుంది. దేశంలోనే పేరెన్నికగన్న పుణ్యక్షేత్రంగా పేరున్న తిరుపతి ఎంపీ నియోజకవర్గానికి తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ.. వరుస పెట్టి ఎంపీగా గెలిచిన ట్రాక్ రికార్డు ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత చింతా మోహన్. కాంగ్రెస్ పార్టీ అంటే వీర విధేయతను ప్రదర్శించే ఆయన.. వైఎస్ అంటే కూడా అంతులేని అభిమానం. ఆయన్ను పెద్ద ఎత్తున అభిమానించే వారిలో ఆయన ఒకరిగా చెబుతుంటారు. అలాంటి ఆయన తాజాగా తాను అభిమానించిన నేత కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ.. ఆయన ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన వైనం సంచలనంగా మారింది.

రాజధానిగా అమరావతి కాదని.. మూడు రాజధానులంటూ మంకుపట్టు పట్టుకొని కూర్చున్న ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్న ఆయన.. రాజధాని నిర్మాణం ఆగిపోవటంతో రైతులు.. మహిళలు రోడ్డెక్కినట్లుగా ఫైర్ అయ్యారు. తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. వైఎస్ జగన్ తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. ఒకింత సూటిగా.. అంతకు మించిన ఘాటుగా విరుచుకుపడ్డ ఆయన వ్యాఖ్యల్లోని కీలకాంశాల్ని చూస్తే..

- వైసీపీ పాలనలో మొండి గోడలుగా అమరావతి మిగిలింది. పోలవరం నిర్మాణం ముందుకు సాగటం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏమైపోయిందో?

- అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైంది. ఆర్థిక అసమానతలు పెరిగాయి. పేదలు రోజుకు రూ.100 కూడా సంపాదించుకోలేకపోతున్నాడు. ఆకలితో నిద్రపోవటం లేదు.

- దేశంలో 60 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుంటే.. ఏపీలోనే కోటి మంది ఉన్నారు. విజయవాడలోనే 2 లక్షల మంది ఆకలితో ఇబ్బందులకు గురవుతున్నారు.

- ఏపీలో కోటి మంది.. విజయవాడలో 2 లక్షల మంది ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఒక్కపూట భోజనం కూడా అందని పరిస్థితి ఉంది. ఇదేనా జగన్ చెబుతున్న రాజన్న రాజ్యం? తండ్రి ఆశయాలకు ఆయన తూట్లు పొడిచారు.

- వైసీపీ చెందిన మంత్రులు.. ఎమ్మెల్యేలకు డబ్బే డబ్బు అంటూ దోచుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా పాలకులు అబద్ధాలు చెబుతున్నారు.

- రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన డెవలప్ మెంట్ తప్ప ఇప్పుడు చేసిందేమీ లేదు. విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా మోసం చేశారు.

- ప్రధాని మోడీకి జగన్ దత్తపుత్రుడు. ఆయన చెప్పిందే ఈయన చేస్తారు. ప్రజలు.. ప్రభుత్వ ధనాన్ని అదానీకి మోడీ దోచి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అదానీ రాష్ట్రంగా మారుతోంది.

- చదువులు చెప్పే గురువులను బంట్రోతులుగా మార్చిన ఘనుడు జగన్. ఒక్క ఉపాధ్యాయుడు కూడా సంత్రప్తిగా పని చేయని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో విద్య.. వైద్య రంగాల్ని జగన్ పూర్తిగా నాశనం చేశాడు. ఏపీని అంధకారంలోకి నెట్టిన ఘనత ఆయనదే.

- ఒక్క ఛాన్స్ అంటే జగన్ కు ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు ఆయన్ను సాగనంపేందుకు ఎదురుచూస్తున్నారు.

- సర్దార్ వల్లభాయ్ పటేల్.. అంబేడ్కర్ ఫోటోలు పెడుతున్నారు. వాజ్ పేయ్.. అడ్వాణీ మీ నేతలు కాదా? వారిని గుర్తు చేసుకోరా? 2024 ఎన్నికల్లో బీజేపీ 100సీట్లకే పరిమితమువుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500లకు గ్యాస్ ఇస్తాం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.